వామ్మో ఇదేం ఇచ్చుకోవటం సరయూ

Mon Sep 13 2021 09:41:24 GMT+0530 (IST)

Sarayu Eliminated From Bigg boss 5

ఇంగ్లిషులో బూతుల్ని స్టైల్ గా పలికేసేటప్పుడు.. తెలుగు బూతుల్ని వాడేస్తే తప్పేంటి? అన్న బోల్డ్ కాన్సెప్టుతో రూపొందించిన వెబ్ వీడియోలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం ద్వారా పెను దుమారాన్నే రేపారు సరయూ. చూసినంతనే ఆకర్షణీయంగా ఉంటూ.. పరమ నాటుగా డైలాగులు అప్పజెప్పటం ద్వారా వెబ్ దునియాలో క్రేజీ స్టార్ గా ఆమె అవతరించారు. తెలంగాణ యాసతో మస్తు ఫైర్ బ్రాండ్ గా వెలిగిపోయిన ఆమె నోటి ముందు ఎంత ముదురుకేసైనా బలాదూరే అన్నట్లుగా ఆమె నటించే చిట్టి వీడియోల్లో తరచూ దర్శనమిస్తుంటుంది.అలాంటి సరయూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఆమె ఎలా ఉంటుంది? ఎవరితో ఎలా బిహేవ్ చేస్తుంది? ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి.అయితే.. అనూహ్యంగా మొదటి వారంలోనే ఎలిమినేట్ కావటం ద్వారా సరయూ అందరిని ఆశ్చర్యానికి గురి  చేసింది. వాస్తవానికి.. బలమైన కంటెస్టెంట్లలో ఆమె కూడా ఒకరన్న భావన కలిగిన దానికి భిన్నంగా మొదటి వారంలోనే ఆమె తీరు హౌస్ సభ్యుల మధ్య స్పష్టమైన విభజన రేఖను తీసుకొచ్చింది.

వంద రోజులు హౌస్ లో ఉంటానని చెప్పిన సరయూ వారం రోజులకే హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా చివర్లో ఎవరూ ఊహించని విధంగా విరుచుకుపడింది. తన ఎలిమినేషన్ ను ఏ మాత్రం ఊహించని ఆమె.. హౌస్ నుంచి వీడిపోవాల్సి వచ్చినప్పుడు ఆమె తీవ్రమైన భావోద్వేగానికి గురైంది. ఇక.. హౌస్ నుంచి స్టేజ్ మీదకు వచ్చిన వేళ.. నాగార్జున ఆడించిన ఒక గేమ్ లో ఒక రేంజ్ లో ఊగిపోయి.. తనకు నచ్చని వారిపై శివాలెత్తింది. తీవ్రమైన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తూ..అందరికి షాకిచ్చింది.

హౌస్ లో బెస్టు ఫైవ్.. వరస్ట్ 5 హౌస్ మేట్స్ ఎవరో చెప్పాలన్న నాగార్జున మాటలకు.. తన మనసులోని కసి మొత్తాన్ని తీర్చేసుకున్నట్లుగా వ్యవహరించింది సరయూ. తనకు నచ్చిన టాప్ 5 కంటెస్టెంట్ల గురించి చెబుతూ..

1. శ్వేత.. స్వచ్ఛమైనది

2. మానస్.. మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు

3. ప్రియాంక.. ఎక్కువగా మిస్ అవుతాను

4. విశ్వ.. ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తాడు.. అలిసిపోడు

5. హమీద.. నా బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఆమెనే ఎక్కువగా నిర్లక్ష్యం చేశా.

మరి.. టాప్ ఫైవ్ వరస్ట్ కంటెస్టెంట్లు ఎవరన్న దానికి మాత్రం సరయూ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి.. స్టేజ్ మీదకు వచ్చిన వేళలో.. తమ మీద మరింత సానుభూతి వ్యక్తమయ్యేలా వ్యవహరించటం మామూలే. అందుకు భిన్నంగా.. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తానేం అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేయాలన్నట్లుగా వ్యవహరించిన సరయూ.. హౌస్ లోని వారిని మాత్రమే కాదు.. ఈ షోను టీవీల్లో చూస్తున్న వారికి సైతం తన తీరుతో దిమ్మ తిరిగేలా షాకిచ్చింది.

ఫైవ్.. వరస్ట్ కంటెస్టెంట్లు వారే..

1. సిరి

2. షణ్ముఖ్

3. లహరి

4. సన్నీ

5. కాజల్

సిరి.. షణ్ముఖ్ ఒక వ్యూహంతో వచ్చారని.. బయటే అంతా ఫిక్స్ చేసుకొని వచ్చారని మండిపడింది. షణ్ముఖ్ గురించి చెబుతూ.. ‘‘అరేయ్ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా. అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా?’’ అంటూ ఒక రేంజ్ లో ఇచ్చి పడేసింది.  చాలామంది హౌస్ మేట్స్ ముందు ఒకలా.. వెనుక మరోలా ఉంటున్నారని ఆరోపించింది. సన్నీ గురించి మాట్లాడుతూ తీవ్రమైన కామెంట్లు చేసింది. గతంలో అతనితో ఒక సినిమా చేశానని.. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటనతో ఆయన ఇగో హర్ట్ అయ్యిందని.. అప్పటి నుంచి తన మీద పగ పెంచుకున్నాడని నొక్కి చెప్పింది.

ఇలా తన మీద సరయూ చేస్తున్న ఆరోపణలకు సన్నీ స్పందించి ఏదో చెబుతుంటే.. అందుకు అడ్డుపడిన సరయూ.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసంటూ ఊగిపోయింది. లహరిని ఉద్దేశించి.. ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట.. అంత ఈగో ఏమిటి? ఆ టోన్ మార్చుకో.. ఎదగటానికి మనుషఉల్ని తొక్కాల్సిన అవసరం లేదని గట్టిగా వాయించేసింది. కాజల్ ను ఉద్దేశించి.. కాస్త బుర్ర పెట్టి  ఆడాలని సలహా ఇచ్చింది. మొత్తానికి.. తనదైన ఫైర్ బ్రాండ్ మార్కును రియల్ స్టేజ్ మీద చూపించిన సరయూ అందరిని షాకిచ్చి ఎగ్జిట్ అయ్యిందని చెప్పక తప్పదు.