బాలీవుడ్ లో పోటీకి సై అంటున్న టాలీవుడ్ దర్శకులు

Fri Apr 19 2019 07:00:01 GMT+0530 (IST)

Sandeep Vanga vs Prakash Kovelamudi In Bollywood

బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీల వల్ల నిర్మాతలకు టెన్షన్ ఉంటుందేమో కానీ ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ ఆ పోటీలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.  ఈసారి అలాంటి పోటీనే రెండు బాలీవుడ్ సినిమాల మధ్యలో జరుగుతోంది.  చిత్రమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకు దర్శకులు తెలుగువారు కావడం.ఈ రెండు సినిమాల్లో ఒకటి 'కబీర్ సింగ్'. రెండో సినిమా 'మెంటల్ హై క్యా'.   ఈ రెండు సినిమాలు జూన్ 21 న రిలీజ్ అవుతున్నాయి.   'కబీర్ సింగ్' గురించి మాట్లాడుకుంటే తెలుగులో భారీ సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' రీమేకే ఈ చిత్రం.  తెలుగు వెర్షన్ దర్శకుడు సందీప్ వంగా హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ - కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఉంది.  రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ కు నచ్చడంతో  సినిమా మరింతగా హైప్ నెలకొంది.  ఇక 'మెంటల్ హై క్యా' విషయానికి వస్తే కంగనా రనౌత్ హీరోయిన్.. రాజ్ కుమార్ రావ్ హీరో.  దర్శకుడు కే. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.   నిజానికి 'కబీర్ సింగ్' రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ అయింది కానీ 'మెంటల్ హై క్యా' మాత్రం రెండు మూడుసార్లు రిలీజ్ డేట్లు మార్చిన తర్వాత ఫైనల్ గా జూన్ 21 కి ఫిక్స్ అయింది.

రెండూ సినిమాలలో' కబీర్ సింగ్' బెటర్ గా అనిపిస్తున్నా.. 'మెంటల్ హై క్యా' ను తక్కువ చెయ్యలేం.  కంగనా పెద్ద స్టార్. పైగా కంగనా.. రాజ్ కుమార్ రావ్ ఇద్దరూ బ్రిలియంట్ ఆర్టిస్టులే.. పోటీ పడి నటించి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి ఇప్పటివరకూ టేకప్ చేసిన ఏ ప్రాజెక్టు కూడా సక్సెస్ కాలేదు.   మరి సందీప్ వంగా Vs ప్రకాష్ కోవెలమూడి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.  రెండూ హిట్ అయితే మాత్రం ఒక్కసారి మళ్ళీ బాలీవుడ్ అంతా టాలీవుడ్ వైపు చూడడం ఖాయం.