మళ్లీ అదే న్యూస్ .. మిస్టర్ బీన్ చనిపోయాడు అసలు సంగతేమిటంటే

Wed Nov 24 2021 15:00:06 GMT+0530 (IST)

Same News Again Mr Bean Is Dead  In Fact

ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేకుండా స్లాప్ స్టిక్ కామెడీ తో తన మైమ్ యాక్టింగ్తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్. తన అద్భుతమైన నటనతో ‘మిస్టర్ బీన్’ పాత్రను ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దిన ఆయన అభిమానుల మదిలో నవ్వుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తరువాత క్రమంగా ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో రోవాన్ అట్కిన్సన్ ను అందరూ మిస్టర్ బీన్ అని పిలవడం విశేషం.

బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయగా ఈ వార్త చూసిన ఆయన అభిమానులు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి మండిపడ్డారు. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012 2013 2015 2016 2017 2018.. ఈ ఏడాది మేలో కూడా ఆయన మరణించారంటూ ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.ఇలా ఏటా అసత్యపు వార్తలు రావడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రొవాన్ అట్కిన్సన్ ప్రతి సంవత్సరం ఎందుకు చనిపోతాడు’ ‘మా నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నారు’ అని మిస్టర్ బీన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మిస్టర్ బీన్ ఫేస్‌బుక్ పేజీ ప్రపంచంలో అత్యధికంగా లైక్ చేయబడిన పేజీలలో 10వ స్థానంలో ఉందంటే మిస్టర్ బీన్ పాత్రకు ఉన్న ప్రజాదరణ ఎంత అనేది అంచనా వేయవచ్చు.ప్రస్తుతం రోవిన్ అట్కిన్సన్ ప్రముఖ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.