పవన్ టైటిల్.. రెస్పాన్సిబులిటీ ఎవరిదీ?

Mon May 16 2022 20:00:01 GMT+0530 (IST)

Samantha Vijay Deverakonda Kushi Movie

బ్లాక్ బస్టర్ క్లాసిక్ టైటిల్స్ ని రీమేక్ లని ముట్టుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. ఆ టైటిల్ ని కానీ కథని కానీ మళ్లీ చేస్తే దానికి మ్యాచ్ అయ్యేలా వుండాలి లేదా.. దానికి దగ్గరగా వుండాలని భావిస్తారు జాగ్రత్తలే తీసుకుంటారు. ఆ సినిమా గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా చేస్తామని చెబుతారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ `తొలి ప్రేమ` చిత్ర టైటిల్‌ని ఇటీవల మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ సినిమా కోసం తీసుకుని `తొలిప్రేమ` టైటిల్ తో  ఓ లవ్ స్టోరీని వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కు ముందే వరుణ్ తేజ్ `తొలి ప్రేమ` టైటిల్ కున్న గౌరవానికి ఎక్కడా భంగం కలిగించని స్థాయిలో మా సినిమా వుంటుందని హామీ ఇచ్చారు. సినిమా అదే స్థాయిలో లేకపోయినా మంచి విజయాన్నే సాధించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ శాంతించారు. ఇప్పడు పవన్ కల్యాణ్ కు సంబంధించిన మరో బ్లాక్ బస్టర్ క్లాసిక్ లవ్ స్టోరీకి సంబంధించిన టైటిల్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాకు ఉపయోగిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ `ఖుషీ`. ఎస్. జె. సూర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని విభాగాల్లోనూ టాప్ లో నిలిచి పవన్ కెరీర్ లోనే ఓ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  

అలాంటి టైటిల్ ని విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి పెట్టారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం కీలక ఘట్టాల చిత్రీకరణ కశ్మీర్ లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ పఠాన్ తరహా డ్రెస్ లో కనిపించగా సమంత సంప్రదాయ హిందూ యువతిగా చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మధ్యలో పింక్ ఆకారంలో కశ్మీర్ మ్యాప్ కనిపిస్తుండగా శాంతి పావురాలు ఎగురుతూ కనిపించిన తీరు ఈ మూవీ టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా స్పష్టం చేస్తోంది.

ఈ విషయం పక్కన పెడితే పవన్ టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టుకోవడమే ఇప్పడు ప్రధాన చర్చగా మారింది. మేకర్స్ ఈ టైటిల్ ని ఆలోచించి పెట్టారా?  లేక కథకు టైటిల్ అవసరం కాబట్టి పెట్టారా? అన్నది తెలియాల్సి వుంది. `ఖుషీ` మూవీకున్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ టైటిల్ అనగానే చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానికి మ్యాచ్ కాకపోయినా.. ఎక్కడ తగ్గినా వారి చేతిలో ట్రోల్ కాక తప్పదు. ఈ విషయాన్ని మేకర్స్ హీరో డైరెక్టర్ గుర్తు పెట్టుకుని సినిమాని బాధ్యతగా చేస్తారా? అని ఫ్యాన్స్ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్ తేజ్ `తొలి ప్రేమ` టైటిల్ విషయంలో అష్యూరెన్స్ ఇచ్చినట్టుగానే విజయ్ దేవరకొండ `ఖుషీ` టైటిల్ విషయంలో అభిమానులకు అష్యూరెన్స్ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. `టక్ జగదీష్`తో కొంత నిరుత్సాహ పరిచిన శివ నిర్వాణ `ఖుషీ` తో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తాడా?  లేదా అన్నది తెలియాలంటే ఈ ఏడాది డిసెంబర్ 23 వరకు వేచి చూడాల్సిందే.