సామ్.. నయన్ తెలుగు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Tue May 17 2022 13:26:38 GMT+0530 (IST)

Sam Nayan Good news for Telugu fans

సౌత్ స్టార్ హీరోయిన్స్ నయనతార మరియు సమంత కలిసి నటించిన చిత్రం కాతువాకుల రెండు కాదల్. మొదట ఈ సినిమాను తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలనే ఆలోచన లేనట్లుగా ఉంది. అందుకే మొదట్లో తెలుగు లో సినిమా గురించి హడావుడి చేయలేదు. కాని విడుదల ముందు మాత్రం సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తున్నామన్నట్లుగా చెప్పుకొచ్చారు.ఇక్కడ పెద్దగా సినిమా ప్రమోషన్ కూడా చేయలేదు. దాంతో కాతువాకుల రెండు కాదల్ సినిమా తెలుగు లో విడుదల అయ్యిందా లేదా అనే విషయం కూడా తెలియకుండా పోయింది. పైగా ఈ సినిమాను విడుదల చేసిన సమయంలో తెలుగు లో ఒక పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల అయ్యింది. దాంతో ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ ఉన్నా కూడా డబ్బింగ్ సినిమా అవ్వడం వల్ల మీడియాలో కాని థియేటర్లలో కాని జనాలు పట్టించుకోలేదు.

కాతువాకుల రెండు కాదల్ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో నయనతార మరియు సమంత ల అభిమానులు తెలుగు లో ఆ సినిమాను చూడాలని ఆశ పడ్డారు. కాని అప్పటికే థియేటర్ల నుండి సినిమా కనిపించకుండా పోవడంతో అయ్యో అనుకున్నారు. గత కొన్ని రోజులుగా వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమాను ఇదే నెల 27వ తారీకున స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. నయనతార మరియు సమంతతో పాటు ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు.. తెలుగు లో మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నయన్ మరియు విఘ్నేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. కరోనా వల్ల ఆలస్యం అయినా కూడా తమిళనాట మంచి అంచనాలు కలిగి ఉండటంతో అక్కడ మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ సినిమా సక్సెస్ ఆనందంలోనే ఇంకా నయన్ మరియు విఘ్నేష్ లు ఉన్నారు. ఒక విభిన్నమైన ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా ట్రైలర్ పోస్టర్స్ చూస్తుంటే క్లీయర్ గా తెలుస్తుంది.