ఆ అభ్యంతకర వీడియోలపై హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్!

Sat Aug 13 2022 11:11:57 GMT+0530 (IST)

Bollywood star hero Salman Khan approached the Bombay High Court

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. పన్వేల్లో తన ఫామ్ హౌస్ పొరుగున ఉండే కేతన్ కక్కడ్ అనే వ్యక్తి తనపై అభ్యంతకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలను తొలగించాలని కోరాడు. అలాగే కేతన్ కక్కడ్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని సల్మాన్ ఖాన్ కోర్టును అభ్యర్థించాడు. ఈ విషయంలో ముందు సల్మాన్ ఖాన్ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. కేతన్ కక్కడ్ అప్‌లోడ్ చేసిన వీడియోలు ఊహాజనితమైనవన్నారు. అవి సల్మాన్ ఖాన్‌కు పరువు నష్టం కలిగించడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రేక్షకులను మతపరంగా రెచ్చగొట్టాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

మైనారిటీ వర్గానికి చెందిన సల్మాన్ ఖాన్ పన్వేల్‌లోని గణేశుడి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కేతన్ కక్కడ్ ఆ వీడియోలో తప్పుడు ఆరోపణలు చేశాడని సల్మాన్ ఖాన్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ను బాబర్ ఔరంగజేబులతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడన్నారు. అంతేకాకుండా అయోధ్యలో రామ మందిరం కట్టడానికి 500 ఏళ్లు పట్టిందని.. సల్మాన్ ఖాన్ మాత్రం వినాయకుడి ఆలయాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

కేతన్ కక్కడ్.. సల్మాన్ ఖాన్‌పై పోస్టు చేసిన వీడియోలను లక్షలాది మంది వీక్షకులు వీక్షించారని తెలిపారు. వారు సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తమ వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతప్రాతిపదికన చీలిక తెచ్చేలా కేతన్ కక్కడ వీడియోలు పోస్టు చేశారని కోర్టుకు నివేదించారు. కేతన్ కక్కడ్.. సల్మాన్ పై పెట్టిన వీడియోలు హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలకు దారితీసేలా ఉన్నాయన్నారు.

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌసులో మాదక ద్రవ్యాలను చిన్న పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నాడని కూడా కేతన్ కక్కడ్ తప్పుడు వీడియోలు పెట్టాడని సల్మాన్ న్యాయవాది బాంబే హైకోర్టు దృష్టికి తెచ్చారు. వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.