సాయిపల్లవి నిజంగానే సింగిల్ పీసే!

Wed Sep 15 2021 00:00:01 GMT+0530 (IST)

Sai pallavi is really a single piece

చురుకుదనానికీ .. చలాకిదానానికి ప్రతీక సాయిపల్లవి. ఉవ్వెత్తున ఎగసిపడే ఉత్సాహానికీ .. ఊరంతటి ఉల్లాసానికి మారు పేరు సాయిపల్లవి. తెరపై ప్రవహించే చైతన్యం సాయిపల్లవి .. మనసు మనసును ఆక్రమించే నవరస నట పరిమళం సాయిపల్లవి.  అసలు ఈ పేరులోనే ఏదో మత్తు ఉందనుకునేవారు కొందరైతే .. ఏదో మంత్రంలా ఉందనుకునేవారు మరికొంతమంది. ముందుగా మలయాళ సినిమాలు చేసిన సాయిపల్లవి ఆ తరువాత తమిళ సినిమాల మీదుగా తెలుగు తెరవైపు వచ్చింది. తెలుగు తెరను 'ఫిదా' సినిమాతో ఈ అమ్మాయి పరిచయం చేసుకుంది.ఈ సినిమా పోస్టర్లు చూసినవారు పెద్ద అందగత్తె కాదు గదా అనుకున్నారు. శేఖర్ కమ్ముల వేరెవరినైనా ట్రై చేసి ఉంటే బాగుండునని చెప్పుకున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇంతబాగా చేసిన ఈ పిల్ల ఎవరబ్బా? అనుకున్నారు. వయసులో ఉన్నవారు అలాంటి అమ్మాయి తోడు కావాలని కోరుకుంటే వయసైన వాళ్లు అలాంటి కూతురు ఉండాలని భావించారు. అంతగా సాయిపల్లవి తన నటనతో కట్టిపడేసింది. దాంతో ఆమెకి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ పాత్ర మంచిదైతేనే . . ఆ పాత్ర చుట్టూ అల్లుకోబడిన కథ మంచిదైతేనే  అంటూ సాయిపల్లవి ఆంక్షలు పెట్టింది.

దాంతో పారితోషికం చెప్పగానే ఎగిరి గంతేసే రకం కాదు ఈ అమ్మాయి అనే విషయం ఇండస్ట్రీకి అర్థమైంది. కొంతమంది అహంభావం అన్నారు .. మరి కొంతమంది ఆత్మవిశ్వాసం అన్నారు. ఎవరు ఏ పేరు పెట్టుకున్నా తనకి నచ్చిన కథలకి మాత్రమే ఓకే చెబుతూ సాయిపల్లవి ముందుకు వెళ్లింది. అలా  'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో మరిన్ని మార్కులు సంపాదించేసింది. జయసుధ .. సౌందర్య తరువాత మళ్లీ ఒక మంచి హీరోయిన్ తెలుగు తెరకి దొరికిందని అంతా చెప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత అభినయం తెలిసిన గడుసైన అమ్మాయి సాయిపల్లవినే అని అంతా ఒప్పుకున్నారు.

సాయిపల్లవికి ఏ పాత్ర ఇచ్చినా తెరపై ఆ పాత్ర మినహా ఆమె కనిపించదు. ఆమె ఎంత సహజంగా నటిస్తుందో .. అంత గొప్పగా డాన్స్  చేస్తుంది. సాధారణంగా అంతా హీరోల డాన్సుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకు భిన్నంగా ఈ తరంలో తన డాన్స్ గురించి కూడా చెప్పుకునేలా చేసిన ఏకైక హీరోయిన్ సాయిపల్లవి అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె డాన్సులకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారనేది ఆ పాటలకు దక్కుతున్న మిలియన్ల కొద్దీ వ్యూస్ చెబుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన 'సారంగధరియా' పాట ఏ రేంజ్ లో దూసుకుపోయిందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

సాయిపల్లవి చేసిన 'లవ్ స్టోరీ' కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో .. 'విరాటపర్వం' కోసం కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. హీరో ఎవరైనా హీరోయిన్ సాయిపల్లవి అయితే ఆ సినిమాకి అదనపు బలం చేకూరినట్టే. ప్రత్యేకమైన ఆకర్షణ తోడైనట్టే. గ్లామరస్ హీరోయిన్లకు నటనతో గట్టిపోటీ ఇవ్వడమనేది బహుశా సాయిపల్లవికే సాధ్యమైందేమోనని అనిపించకమానదు. తెరపై ఎంతమంది స్టార్లు ఉన్నప్పటికీ సాయిపల్లవి  అభినయ చందమామలా ప్రత్యేకంగా కనిపించకమానదు. 'ఫిదా'లో తన గురించి తాను చెప్పుకున్నట్టుగా నిజంగానే ఆమె సింగిల్ పీసే!