SSMB28: సమ్మర్ రిలీజ్ సాధ్యమేనా..?

Mon Nov 28 2022 12:05:15 GMT+0530 (India Standard Time)

SSMB28: Is it possible for a summer release?

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి కల్ట్ చిత్రాల తర్వాత దర్శక హీరోల కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.SSMB28 చిత్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే సెట్స్ మీదకు వెళ్ళడానికి టైం పట్టింది. ఎట్టకేలకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి హై ఇంటెన్స్ యాక్షన్స్ సీక్వెన్స్ తో కూడిన ఓ షెడ్యూల్ పూర్తి చేసారు. అలానే 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే మొత్తం స్క్రిప్ట్ ను పూర్తిగా మార్చాలని నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహేశ్ బాబు వ్యక్తగత జీవితంలో చోటు చేసుకున్న విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవతూ వచ్చింది. దీంతో ముందుగా అనౌన్స్ చేసినట్లు వచ్చే సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ముందు అనుకున్న విధంగానే వచ్చే ఏప్రిల్ చివర్లోనే మహేష్ బాబు 28వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర బృందం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్నట్లు మేకర్స్ మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ తో రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల తన తండ్రి కృష్ణ మరణంతో శోక సముద్రంలో మునిగిపోయిన మహేష్ బాబు.. వీలైనంత త్వరగా స్ట్రాంగ్ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ రెండో వారంలో సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు నిర్విరామంగా పవర్ ప్యాక్డ్ షెడ్యూల్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

మహేష్ మరియు త్రివిక్రమ్ ఇద్దరూ SSMB28 ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఎలాంటి విశ్రాంతి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. వచ్చే వేసవిలో సినిమాని థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. కాకపోతే మహేష్ లాంటి స్టార్ హీరోతో నాలుగైదు నెలలలో సినిమా పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయించే హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకొని భార్యా పిల్లలతో హాలిడేకి వెళ్లి వస్తుంటారు. ఆయన తల్లి ఇందిరా దేవి మరణం తర్వాత విదేశాలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తన తండ్రి మరణం నుంచి బయటకు రావడానికి మరోసారి హాలిడేకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అందులోనూ క్రిస్మస్ - న్యూ ఇయర్ - సంక్రాంతి వంటి ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ ఎలాంటి విరామం తీసుకోకుండా షూటింగ్ చేయడం సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో అవాంతరాలు లేకుండా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే SSMB28 లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కథానాయికగా శ్రీ లీలని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలానే ఓ సీనియర్ నటి కీలక పాత్ర పోషించనుందని.. సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.