పవన్ కీ .. మహేశ్ కి అదే తేడా: ఎస్.జె.సూర్య

Thu Nov 25 2021 15:31:27 GMT+0530 (IST)

S J Surya revealed About mahesh And pawan

అజిత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'వాలి' .. ఆ సినిమాతోనే టాలీవుడ్ తెరకి దర్శకుడిగా ఎస్.జె.సూర్య పరిచయమయ్యాడు. ఇక విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'ఖుషీ' అది ఎస్.జె. సూర్యకి అక్కడ రెండవ సినిమా. టాలీవుడ్ కి వచ్చేసరికి అదే 'ఖుషీ' సినిమాతో ఆయన పవన్ కల్యాణ్ కి ఒక తిరుగులేని హిట్ ను ఇచ్చాడు.అలాంటి ఎస్.జె. సూర్య ప్రస్తుతం దర్శకత్వం పై కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'మానాడు' టైటిల్ తో రూపొందిన సినిమా 'ది లూప్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఒక వైపున డబ్బుకోసం హోటల్లో పనిచేస్తూ మరో వైపున సినిమాల్లో ప్రయత్నాలు చేసేవాడిని. అలా ఐదారు హోటళ్లు మారాను.

కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాను. సినిమాల్లో స్టార్ ను కావాలని ఉండేది. అలా కావాలంటే నన్ను దర్శక నిర్మాతలు నమ్మి నాకు అవకాశం ఇవ్వాలి. అలా ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? యాక్టర్ కావాలంటే ముందు దర్శకుడిగా మారాలని అనుకున్నాను.

దర్శకుడిగా మారిన తరువాత కొంత డబ్బు సంపాదించి నిర్మాతను కావాలి. అలా వచ్చిన గుర్తింపుతో యాక్టర్ ను కావాలని అనుకున్నాను. అలా అనుకున్న తరువాత పదేళ్ల పాటు కష్టపడ్డాను. అప్పుడు నటుడిగా నా మొదటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాను.

దర్శకుడిగా పవన్ కల్యాణ్ తో 'ఖుషీ' .. మహేశ్ తో 'నాని' సినిమాలు చేశాను. ఆ సమయంలో వాళ్లిద్దరినీ నేను చాలా దగ్గరగా చూశాను. పవన్ విషయానికి వస్తే ఆయన చాలా స్పెషల్ అని చెప్పాలి. దేవుడు తానే స్వయంగా కూర్చుని తయారు చేసిన సింగిల్ పీస్ అని చెప్పాలి.

పవన్ ఏదైనా అనుకుంటే వెంటనే అది జరిగిపోవాలి. ఒక సినిమా చేయాలన్నా .. వద్దనుకున్నా తన నిర్ణయాన్ని వెంటనే చెప్పేస్తారు. మహేశ్ బాబు విషయానికి వచ్చేసరికి ఆయన తన మనసుకు నచ్చిన పనిని చేయడానికి కొంత ఆలోచన చేస్తారు .. కొంత సమయం తీసుకుంటారు.

అదే వాళ్లిద్దరి మధ్య నేను గమనించిన తేడా. ఇద్దరూ మంచి టాలెంట్ ఉన్నవారే .. దర్శకుల హీరోలే. తమిళంలో నేను అజిత్ ... విజయ్ లతో కూడా కలిసి పనిచేశాను. స్వభావాన్ని బట్టి అజిత్ ను పవన్ తోను .. విజయ్ ను మహేశ్ తోను పోల్చవచ్చు" అని చెప్పుకొచ్చాడు.