Begin typing your search above and press return to search.

రూ.400 కోట్ల ఓటీటీ ఆఫర్‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
రూ.400 కోట్ల ఓటీటీ ఆఫర్‌
X
బాలీవుడ్ లో సినిమాలు మునుపటిలా విడుదల అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో హిందీ సినిమాలు థియేటర్ రిలీజ్ పై ఆశ వదిలేసి ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ అయినా మహారాష్ట్రలో మాత్రం ఇంకా పరిస్థితి సాదారణ స్థికి రాలేదు. అందుకే బాలీవుడ్‌ సినిమాలు థియేటర్‌ రిలీజ్ కు నోచుకోవడం లేదు. తెలుగు లో వరుసగా థియేటర్‌ రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో కూడా చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. అయినా కూడా హిందీలో థియేటర్‌ రిలీజ్ కు స్కోప్ లేకుండా పోయింది. ఒక వేళ మొండి ధైర్యంతో విడుదల చేసినా కూడా వందల కోట్లు రావాల్సిన వసూళ్లు అయిదు పది కోట్ల కే పరిమితం అవుతుంది. అందుకే చాలా సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక్క సినిమాను పూర్తి చేసి విడుదల చేయకుంటేనే నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అలాంటిది బాలీవుడ్‌ నిర్మాత ఆధిత్య చోప్రా మాత్రం నాలుగు పెద్ద సినిమాలను నిర్మించి విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నారు.

నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ ను కలిగి ఉన్నాయి. దాంతో ఓటీటీ ద్వారా ఆ సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కొందరు ఉన్నారు. కాని నిర్మాత ఆధిత్య చోప్రా మాత్రం విడుదల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఖచ్చితంగా సినిమా ను థియేటర్ల ద్వారానే విడుదల చేస్తాం అంటున్నాడు. ఇటీవల ఒక ప్రముఖ ఓటీటీ 370 కోట్ల రూపాయలను ఆఫర్‌ చేసిందట. ఆ ఆఫర్‌ కు ఆధిత్య చోప్రా స్పందించలేదు. ఆ తర్వాత అమెజాన్ వారు ఏకంగా రూ.400 కోట్ల రూపాయలను ఆఫర్‌ చేశారట. పెట్టిన బడ్జెట్‌ కు దాదాపుగా రెట్టింపు ఇచ్చేందుకు సిద్దం అయినా కూడా నిర్మాత మాత్రం చాలా మొండిగా ఓటీటీ రిలీజ్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అందరు ఆధిత్య చోప్రా మాదిరిగా ఉంటే మన దేశంలో థియేటర్లు ఇంకా కొన్నాళ్లు బతికి బట్ట కడుతాయని సినీ అభిమానులు భావిస్తున్నారు.

ఆధిత్య చోప్రా నిర్మించిన బంటీ ఔర్ బబ్లీ.. పృథ్వీరాజ్.. జయేష్‌ భాయ్‌ జోర్దార్‌ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమాలు విడుదల తర్వాత ఎంత ప్రభావంను చూపిస్తాయి.. ఏ రేంజ్‌ లో విడుదల చేయగలవు అనేది తెలియదు. కాని ఓటీటీ వారు ఇస్తానంటున్న నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా నిర్మాత కాదనడం గొప్ప విషయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్‌ లో ఇప్పటికే బాలీవుడ్‌ కు చెందిన పలు భారీ సినిమాలు నేరుగా స్ట్రీమింగ్ అయ్యాయి. కాని దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న యశ్‌ రాజ్‌ పిక్చర్స్ వారి సినిమాలు మాత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్‌ చేయడానికి నిర్మాత ఒప్పుకోవడం లేదు. అమెజాన్ వారు మరింత డబ్బు ఆఫర్‌ చేసినా కూడా ఆధిత్య చోప్రా మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ కు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. టాలీవుడ్‌ లో కూడా చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే అయ్యాయి... థియేటర్లు ఓపెన్ అయిన కారణంగా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ లు కాస్త తగ్గాయి.