టాప్ స్టోరి: ఇన్ స్టా డ్రాకులా ఎవరో తెలుసా?

Wed Jul 21 2021 21:00:01 GMT+0530 (IST)

Rowdy Star is the hero who has gained the most followers on Instagram

ఫేస్ బుక్.. ట్విటర్.. ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు స్టార్ హీరోల ఫాలోయింగ్ ని డిసైడ్  చేస్తున్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా హీరోలందరికీ  ఇన్ స్టా గ్రామ్ వేదిక అనేది ఇప్పుడు  అత్యంత ముఖ్యమైన మాధ్యమంగా మారిపోయింది. మిలియన్లలో ఫాలోవర్స్ ని దక్కించుకుంటున్నారు.సోషల్ మీడియా ఫాలోయింగ్ ని బట్టి ప్రకటనల ఆదాయం ఉంటోంది. మార్కెట్ పరంగా ఈ ఫాలోయింగ్ కలిసొస్తోంది. అందుకే ఈ వేదికలకు అంతటి ప్రాధాన్యత. ఇటీవలి కాలంలో ఇన్ స్టాని చాలా మంది హీరోలు ఊపేస్తున్నారు. అందులో ఇతర హీరోలతో పోలిస్తే అందరికంటే ముందున్నది రౌడీ విజయ్ దేవరకోండ.

టాలీవుడ్ హీరోలందరిలో ఇన్ స్టాలో అత్యధికంగా ఫాలోవర్స్ ని కలిగిన హీరోగా రౌడీ స్టార్ నిలిచారు. అతని ఇన్ స్టా లో 12 మిలియన్ కు పైగా  ( కోటి 20 లక్షలకు పైగా) ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు.  ఆయనకు సరిగ్గా కోటి 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీకి  లాక్ డౌన్ ముందు ఇంత ఫాలోయింగ్ లేదు. లాక్ డౌన్ సమయంలో దృష్టి సారించి ఫాలోవర్స్ ని పెంచుకున్నారు.

ఇక మూడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ నిలిచారు. ఆయనకు 6.8 మిలియన్ (60 లక్షల 80 వేలు) ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. నాల్గవ స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచారు. ఈయనకు 6.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఐదవ స్థానంలో టాలీవుడ్ హంక్ రానా నిలిచారు.  ఆయనకు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఆరవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 30 లక్షల 90 వేల మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ జాబితాలో స్టార్లంతా ఇటీవలి ఓర్మాక్స్ సర్వేలోనూ టాప్ 10లో నిలిచారు. అంతకుముందు టైమ్స్ 2020 హీరోల జాబితాలోనూ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

టాప్ 6 హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. బన్ని పుష్ప డ్యూయాలజీతో పాన్ ఇండియా వార్ లోకొచ్చాడు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్ రిలీజ్ కాగానే సలార్-ఆదిపురుష్ 3డి.. నాగ్ అశ్విన్ సినిమాలతో అతడు సత్తా చాటనున్నాడు.

విజయ్ దేవరకొండ లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఇండియా లెవల్లో చర్చకొచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ ఒకదాని వెంట ఒకటిగా క్లాసీ సినిమాలతో ముందుకెళుతూ తదుపరి రాజమౌళితో పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేయడం వేడి పెంచుతోంది. చరణ్ వరుసగా రాజమౌళి.. శంకర్ లాంటి దర్శకులతో భారీ సినిమాల్ని ప్లాన్ చేయడంతో అతడి పేరు మార్మోగుతోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ తో చరణ్ నటించే 15వ సినిమా సెట్స్ కెళ్లనుంది. పాన్ ఇండియా కేటగిరీలో వెలుగుతున్న ఈ స్టార్లందరికీ ఇన్ స్టాలో ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది.

సోషల్ మీడియా మేనేజర్లకు డిమాండ్:

స్టార్లకు ఫాలోవర్స్ ని పెంచేందుకు సోషల్ మీడియా మేనేజర్లు ఎంతో ఎఫర్ట్ పెడుతున్న వైనం కనిపిస్తోంది. రెగ్యులర్ గా ప్రతి అంశంపైనా తమ స్టార్ తరపున స్పందిస్తూ ట్వీట్లు ఇన్ స్టా కామెంట్లతో ఫాలోయింగ్ పెంచే పనిలో ఉంటున్నారు. దీనికి ప్రతిఫలం పెద్దగానే ముడుతోందనేది ఓ సర్వే వెల్లడిస్తోంది.