టాలీవుడ్ స్టార్స్ కి డేంజర్ బెల్స్ ?

Fri May 13 2022 22:00:01 GMT+0530 (IST)

Route Films Dragging Tollywood Back

గత కొంత కాలంగా వరుస హిట్ లు పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ కళకళలాడుతోంది. అయితే అదే స్థాయిలో స్టార్స్ నటించిన చిత్రాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా మారుతున్నాయి. గతంలో సినిమా ఫ్లాప్ అని తెలిసినా ఎందుకు ఫ్లాప్ అయింది?.. ఆ కారణాలు ఏంటీ? అని తెలుసుకోవాలన్న ఉత్సాహం సగటు ప్రేక్షకుడిలో వుండేది. కానీ హిట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వింటే తప్ప ప్రేక్షకుడు థియేటర్ కు రాలేని పరిస్థితి మొదలైంది.ఇది టాలీవుడ్ స్టార్స్ కి నిజంగా డేంజర్ బెల్ అని చెప్పక తప్పదు. గతంతో పోలిస్తే సగటు ప్రేక్షకుడి మైండ్ సెట్ మారింది. అప్పుడు సినిమా ఎలా వున్నా థియేటర్ కు వెళ్లాలని అనుకునేవాడు కానీ ఇప్పడు ఓటీటీలు వచ్చేసరికి రెండు మూడు వారాలు ఆగితే అదే సినిమా ఓటీటీలో తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాదీ చూసేయోచ్చు అనే మైండ్ సెట్ కి వచ్చేశాడు. అంతే కాకుండా థియేటర్లకు వెళ్లి వందలు వేలల్లో ఖర్చు చేయడానికి కూడా ఇష్టపడటం లేదు.

ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ 2 మార్వెల్ మూవీస్ లాంటి భారీ చిత్రాల కోసం మాత్రమే భారీగా ఖర్చు చేసి థియేటర్లకు వస్తున్నారు. మామూలు సినిమాలకు మాత్రం థియేటర్ గేట్ ని కూడా టచ్ చేయడానికి ఇష్టపడటం లేదు. ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ 2 చిత్రాలు ఓ రేంజ్ లో వుండటంతో అలాంటి సినిమాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నారు. సాదీ సీదా సినిమాలకు ఆచార్య సర్కారు వారి పాట వంటి చిత్రాలకు భారీ స్థాయిలో ఖర్చు చేసి థియేటర్లకు రావాలని ప్రేక్షకుడు ఆలోచించడం లేదు.

దీంతో స్టార్స్ సినిమాలకు తెలియకుండానే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పాన్ ఇండియా మాయలో ఇండస్ట్రీలు డేంజర్ జోన్ లోకి వెళుతున్నట్టుగా స్పష్టమవుతోంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఓటీటీల వ్యవహారం తయారైంది. మూడు వారాల తరువాత ఓటీటీల్లో స్టార్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండటం వల్ల కూడా ప్రేక్షకులు వేలకు వేలు ఖర్చు చేసి ఫ్యామిలీతో థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా తరువాత టికెట్ రేట్లు భారీగా పెరగడం ఒకటి కాగా సగటు ప్రేక్షకుల్లో భారీ సినిమాల పట్ల పెరిగిన ఆదరణ మరో కారణంగా నిలుస్తోంది.

దక్షిణాదిలోనే కాకుండా ఈ పరిస్థితి యావత్ భారతంలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే కనిపిస్తుండటంతో స్టార్స్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనని భారీ స్థాయిలో ఎగ్జైట్ చేస్తే తప్ప భారీ గా ఖర్చు చేసి సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించకపోవడం నిజంగా స్టార్ లకు గడ్డు కలం మొదలైనట్టేనని ట్రేడ్ వర్గాలు వాపోతున్నాయి.