డార్లింగ్ తో మసాలా డైరెక్టర్ సీక్రెట్ ప్లాన్?

Tue Oct 22 2019 22:03:51 GMT+0530 (IST)

Rohit Shetty Wants Movie With Prabhas

డార్లింగ్ తో మసాలా డైరెక్టర్ సినిమా అనగానే అది పూరి అయ్యి ఉండొచ్చు అన్న సందేహం కలుగుతుంది. కానీ పూరికి ఇప్పట్లో ఆ ఛాన్సే లేదు. `ఇస్మార్ట్ శంకర్` హిట్టు కొట్టగానే డార్లింగ్ కోసం పూరి పెద్ద స్కెచ్ వేశాడని ప్రచారమైంది. అయితే అప్పటికి కేవలం మాటా మంతీ మాత్రమే సాగింది. సినిమాని ఖాయం చేయలేదు.అయితే పూరి కాకుండా మరో మాస్ మసాలా డైరెక్టర్ డార్లింగ్ వెంట పడుతున్నాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడన్నది ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచుతోంది. ఇటీవలే రిలీజైన భారీ పాన్ ఇండియా చిత్రం `సాహో` అంచనాల్ని అందుకోలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం బంపర్ హిట్ కొట్టింది. అక్కడ ప్రభాస్ కి మాంచి క్రేజు తెచ్చింది. ఉత్తరాదిన కలెక్షన్స్ అబ్బురపరిచాయి. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ ఫిలింమేకర్స్ అంతా ప్రభాస్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ ప్రభాస్ ఎందుకనో ఇప్పటికీ హిందీ సినిమాకి సంతకం చేయడం లేదు.

కరణ్ జోహార్ లాంటి కమర్షియల్ మసాలా స్పెషలిస్టులు ప్రభాస్ ని వదిలి పెట్టకుండా కలుస్తున్నా ఇంకా ఇంకా వేచి చూస్తున్నాడు. మాంచి మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ రోహిత్ శెట్టి. ఇటీవలే టెంపర్ (పూరి-ఎన్టీఆర్ మూవీ) రీమేక్ సింబా(రణవీర్ )తో బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మరో భారీ మల్టీస్టారర్ చేస్తున్నాడు. అక్షయ్- అజయ్ దేవగన్ -రణవీర్ వంటి స్టార్లతో `సూర్య వంశీ` అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ సాగిస్తున్నారు. దీని తర్వాత కూడా వేరొక భారీ యాక్షన్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈసారి ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ఖాయం చేయలేదు.

అతడు ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ రాగానే హైదరాబాద్ టౌన్ లో అడుగు పెట్టి ప్రభాస్ ని కలుస్తున్నాడట. కలిసి ఓ సినిమా చేసేందుకు పాజిబిలిటీ ఎంతవరకూ ఉంది? అన్నది ఆరా తీస్తున్నాడట. డార్లింగ్ ఓకే అనాలే కానీ వెంటనే ప్రాజెక్టును ఖాయం చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ ఈ జోడీ సినిమా ఖాయమైందన్న దానికి ఆధారం లేదు. ప్రచారమే కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. మునుముందు కలిసి పని చేసే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ ఓకే అంటే కరణ్ జోహార్ లాంటి నిర్మాత రెడీగానే ఉన్నాడు. రోహిత్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ రెడీ.. ప్రభాస్ 20 `జాన్` చిత్రీకరణ పూర్తవుతోంది. మరి మునుముందు ప్రభాస్ ఏ సినిమా చేస్తాడో.. ఏమవుతుందో చూడాలి.