Begin typing your search above and press return to search.

టికెట్ రేట్లే కారణం.. సౌత్ సినిమా సక్సెస్ పై బాలీవుడ్ భామ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   13 May 2022 3:43 PM GMT
టికెట్ రేట్లే కారణం.. సౌత్ సినిమా సక్సెస్ పై బాలీవుడ్ భామ కామెంట్స్..!
X
బాలీవుడ్ పై సౌత్ సినిమా ఆధిపత్యం కొనసాగుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిందీ చిత్రాలు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి కష్టపడుతుంటే.. మన సినిమాలు వందల కోట్లు కలెక్షన్స్ అందుకుంటున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా సౌత్ సినిమాలు భారీ కలెక్షన్లను సాధించడంపై స్పందించింది.

''దక్షిణాది సినిమాలకు టికెట్ల రేట్లు రూ. 100 నుంచి రూ. 400 లోపు మాత్రమే ఉంటాయి. అంత పెట్టి సినిమా చూడటానికి అభిమానులు పెద్దగా ఇబ్బంది పడరు. అక్కడి హీరోలకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్లంతా సినిమాలు చూస్తారు కాబట్టి భారీగా ఓపెనింగ్స్ వస్తాయి" అని రిచా చద్దా అభిప్రాయ పడింది.

''కానీ హిందీలో అలా కాదు. ఎలాంటి సినిమా అయినా సరే, టికెట్ ధర కనీసం రూ. 500 పైనే ఉంటుంది. అంత మొత్తాన్ని పెట్టేందుకు ప్రేక్షకులు కూడా ధైర్యం చేయరు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. 500 రూపాయలు పెట్టి ఇంట్లోకి నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చని భావించే మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు''

''బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్స్ అత్యాశ వల్ల హిందీ సినిమా నష్టపోతోంది. అందుకే ఇక్కడ పంపిణీదారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల హిందీలో ఒక చిత్రం విడుదలైంది. ఇది త్వరలో ఓటీటీలో వస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ సినిమా మొదటి రోజు వసూళ్లు.. ఆ హీరో తీసుకునే దాంట్లో మూడింట ఒక వంతు కంటే తక్కువ రావడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు'' అని రిచా చద్దా చెప్పుకొచ్చింది.

సినిమా నిలదొక్కుకోవాలంటే వ్యాపారంలో పెద్ద వాటాదారులు బాధ్యత వహించాలని రిచా అభిప్రాయ పడింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న 'బేబీ డాల్' అనే ఆడియో ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే సౌత్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ నార్త్ లో అక్కడి టికెట్ రేట్లతోనే సంచలన విజయాలు అందుకుంటున్నాయనే సంగతి ఇక్కడ ప్రస్తావించాలి.

'పుష్ప' 'RRR' 'కేజీఎఫ్ 2' వంటి సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో భారీ వసూళ్లు రాబట్టాయి. అదే సమయంలో హిందీ స్టార్స్ నటించిన చిత్రాలు మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూశాయి. దీనిని బట్టి రిచా చద్దా చెప్పినట్లు అధిక టికెట్ రేట్లు కారణమని అనడం కన్నా.. మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ కు ఉత్తరాది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని అనుకోవచ్చు.

ఇకపోతే బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రిచా చద్దా. 'మసాన్' - 'ఫుక్రే' ఫ్రాంచైజీ - 'షకీలా' వంటి సినిమాలో నటించిన రిచా.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' చిత్రంతో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని సైతం అందుకుంది. అలాగే 2017లో ‘ఇన్సైడ్ ఎడ్జ్’ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే రిచా.. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఎప్పుడూ భయపడదని బీ టౌన్ లో అంటుంటారు.