సుశాంత్ లైఫ్ లోకి రియా చక్రవర్తి ఎలా వచ్చింది...?

Wed Aug 05 2020 16:20:03 GMT+0530 (IST)

How did Rhea come into Sushant's life ...?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రియా చక్రవర్తి. సుశాంత్ తో కొన్నాళ్లుగా డేటింగ్ చేసింది రియా చక్రవర్తి. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ వీరు అంగీకరించలేదు. అయితే వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేవి. సుశాంత్ బర్త్ డే సందర్భంగా రియా స్పెషల్ గా విషెస్ చెప్పడం.. రియాను 'నా జిలేబీ' అంటూ సుశాంత్ ఫొటో షేర్ చేయడం లాంటివి వారి మధ్య రిలేషన్ ఉంది అనే అనుమానాన్ని బలపరిచాయి. అయితే సుశాంత్ మరణించిన నెల రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా తనను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా రియా చెప్పుకున్నారు.ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేస్తూ.. నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాని.. సుశాంత్ కేసులో నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను.. ఈ కేసుని సీబీఐ దర్యాప్తుకు అప్పగించండి అని కోరింది. అయితే సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియాకు వ్యతిరేకంగా పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఒక్కసారిగా సుశాంత్ సూసైడ్ కేసు రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రియా ఈ కేసుని ముంబైకి బదిలీ చేయాలని సుప్రీకోర్టుని ఆశ్రయించింది. అంతేకాకుండా ఓ వీడియో రిలీజ్ చేసి నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని పేర్కొంది. ఇక రియా గురించి డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది.

కాగా రియా చక్రవర్తి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు చిత్ర పరిశ్రమలోనే. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన 'తూనీగ తూనీగ' అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది రియా. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. దీంతో దక్షిణాదిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. హిందీలో రియా 'మేరే డాడ్ కీ మారుతి' అనే మూవీలో నటించింది. ఈ క్రమంలో 'సోనాలీ కేబుల్' 'దుబారా: సీ యువర్ ఈవిల్' 'బ్యాంక్ చోర్' 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' 'జలేబీ' సినిమాల్లో నటించినా అమ్మడికి అంతగా పాపులారిటీ రాలేదు. అయితే సుశాంత్ తో కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ వార్తల్లో నిలిచింది. రియా ఒక పార్టీలో సుశాంత్ సింగ్ ను మొదటిసారిగా కలిశారని.. ఇద్దరూ ఒకే జిమ్ కు వెళ్లేవారని.. ఆ పరిచయంతోనే క్లోజ్ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికే ఇద్దరితో ప్రేమాయణం సాగించిన సుశాంత్ వారికి బ్రేకప్ చెప్పి రియాతో రిలేషన్ కొనసాగించారు. ఆ తర్వాత రోజుల్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ కూడా వినిపించింది.

ఈ నేపథ్యంలో సుశాంత్ - రియా కలిసి రూమీ జాఫ్రీ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇక తెలుగులో రియా చక్రవర్తి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ''సూపర్ మచ్చి'' సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత సుశాంత్ సినిమాకి డేట్స్ ఇచ్చానని ఈ సినిమా నుండి తప్పుకుందని సమాచారం. ఇక జూన్ 14న సుశాంత్ సింగ్ మరణించాడు. సుశాంత్ మరణించానికి వారం ముందే రియా సుశాంత్ ప్లాట్ నుండి వెళ్లిపోయిందని.. తన కుమారుడికి సంబంధించిన నగదు ల్యాప్ టాప్ క్రెడిట్ కార్డు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లిపోయిందని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ కేసులో రియా చక్రవర్తి పాత్రపై విచారణ సాగుతోంది. ఇప్పుడు ఈ కేసుని సీబీఐ దర్యాప్తుకి అప్పగించడంతో మరిన్ని విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.