'అందరూ పేద ప్రజలకు దానం చేయడానికి సినిమాలు తీస్తున్నారా?'

Sun Aug 02 2020 20:30:33 GMT+0530 (IST)

Rgv sensational comments on twitter

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో కూడా సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుని సినిమాగా రూపొందిస్తున్నాడు. 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ''క్లైమాక్స్'' ''నగ్నం'' ''పవర్ స్టార్'' అనే సినిమాలను విడుదల చేసిన ''మర్డర్'' ''థ్రిల్లర్'' మూవీస్ ని రిలీజ్ కి రెడీ చేశారు. ఈ నేపథ్యంలో పే పర్ వ్యూ పద్ధతిలో టికెట్ ధర పెడుతూ వచ్చాడు.కాగా 'క్లైమాక్స్' సినిమాకి 100 రూపాయలు.. 'నగ్నం' మూవీకి రూ. 200 నిర్ణయించిన వర్మ 'పవర్ స్టార్'కి అడ్వాన్స్ బుకింగ్ కి రూ. 150.. బ్లాక్ బుకింగ్ లో రూ. 350గా నిర్ణయించాడు. తక్కువ ఖర్చుతో ఈ సినిమాలను తెరకెక్కించిన వర్మ బాగానే సొమ్ము చేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా ఆర్జీవీ డబ్బు సంపాదించడానికే ఇలాంటి సినిమాలను తీస్తున్నాడంటూ విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

వర్మ ట్వీట్ చేస్తూ.. ''నేను డబ్బు సంపాదించడానికి ఈ సినిమాలన్నీ చేస్తున్నాననే వారిని అడుగుతున్నా.. మిగతా ఫిలిం మేకర్స్ అందరూ డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదా? వాళ్ళందరూ మానవత్వం కోసమో ఛారిటీ కోసమా లేక పేద ప్రజలకు దానం చేయడం కోసమో సినిమాలు తీస్తున్నారా?'' అని ట్వీట్ చేసారు. దీనికి నెటిజన్స్ వర్మని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా అంటేనే కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారం.. ఏ ఫిలిం మేకర్ అయినా కూడా డబ్బులు సంపాదించడానికే సినిమాలు తీస్తారని కామెంట్స్ చేస్తున్నారు.