రవితేజ పాన్ ఇండియా చిత్రంలో రేణూ దేశాయ్..?

Sat Jan 29 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Renu Desai in Ravi Teja Pan India movie

మాస్ మహారాజా రవితేజ ''టైగర్ నాగేశ్వరావు'' అనే పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నటీనటులు - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. అయితే ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం రేణుదేశాయ్ ని సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.'టైగర్ నాగేశ్వరావు' చిత్రంలో రవితేజ సోదరి పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయమై దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించగా.. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 'జానీ' సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. ఆ మధ్య మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. 'ఆద్య' అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రవితేజ సినిమాలో రేణూ భాగం అవుతారో లేదో చూడాలి.

కాగా 'టైగర్ నాగేశ్వరావు' చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఒకే టైటిల్ తో విడుదల కానుంది. 70వ దశకంలో పోలీసులను ముచ్చెమటలు పట్టించిన మోస్ట్ వాంటెడ్ స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని సమాచారం.

ఇందులో రవితేజ సరసన నటించే హీరోయిన్ తో పాటుగా ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్నారు. మధే సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరావు' చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారని సమాచారం.