Begin typing your search above and press return to search.

'పుష్ప 2' ను అక్కడ సొంతగానే రిలీజ్ చేసుకుంటారా..?

By:  Tupaki Desk   |   26 May 2022 5:56 AM GMT
పుష్ప 2 ను అక్కడ సొంతగానే రిలీజ్ చేసుకుంటారా..?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. గతేడాది చివర్లో కరోనా పాండమిక్ టైంలో రిలీజ్ చేయబడిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అన్ని భాషల్లోనూ 'పుష్ప' మొదటి భాగానికి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై 100 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు 'పుష్ప' రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో 'పుష్ప: ది రూల్' సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతోందని అంచనా వేస్తున్నారు. బన్నీ - సుక్కూ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీపై నెలకొన్న క్రేజ్ దృష్ట్యా.. యూఏస్ రైట్స్ అధిక రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

అయితే 'పుష్ప 2' యుఎస్ హక్కుల విషయంలో నిర్మాతలు పునరాలోచనలో ఉన్నారట. ఈ చిత్రాన్ని స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలానే 'పుష్ప 1' అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

నిజానికి 'పుష్ప: ది రూల్' చిత్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. అయితే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడంతో.. ఇప్పుడు జూలై లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. రెండో భాగంలో ఎలాంటి కథ చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇందులో అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్నా నటించనుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.