రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పోస్టర్లు చూస్తే రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతోనే రమేశ్ వర్మ రంగంలోకి దిగాడనే విషయం అర్థమైపోతుంది. రవితేజ మరోసారి తెరపై మాయాజాలం చేయనున్నాడనే విషయం స్పష్టమైపోతోంది.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని
సమకూర్చాడు. ఆల్రెడీ ఒక్కో సింగిల్ ను వదులుతున్నారు కూడా. ఈ సినిమాలోని ఒక
హుషారైన పాటను రవితేజ పాడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని దేవిశ్రీ వ్యక్తం
చేశాడట. సాధారణంగా తను పాడితే బాగుంటుందని అనుకుంటే ఆ పాటను దేవిశ్రీనే
పాడేస్తుంటాడు. అలాంటి ఆయన ఈ పాటను రవితేజ బాడీలాంగ్వేజ్ ను దృష్టిలో
పెట్టుకుని ట్యూన్ చేసినది గనుక ఆయనే పాడాలని అంటున్నాడట. పాడటం రవితేజకు
కొత్తేమీ కాదు. గతంలో ఆయన 'కాజల్ చెల్లివా' (బలుపు) 'నాటోంకి నాటోంకి'
(పవర్) 'రమ్ పమ్ బమ్' (డిస్కోరాజా) పాటలు పాడారు.
మాస్ కోసం
ఫైట్లు చేయడమే కాదు పాటలు పాడటం కూడా ఆయనకి బాగా తెలుసు. అలాంటి రవితేజ
మరోసారి సింగర్ గా ఈ సినిమా కోసం మైక్ ముందుకు రానున్నాడట. త్వరలోనే ఈ
పాటను దేవిశ్రీ రికార్డు చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో
ఒకటిగా ఈ పాట నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి రవితేజ త్వరలో
మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వనున్నాడన్నమాట. ఈ సినిమాలో అర్జున్ ..
ఉన్ని ముకుందన్ .. ముఖేశ్ రుషి కీలకమైన పాత్రలను పోషించారు.
ఇక
మురళీశర్మ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఆ
తరువాత సినిమాగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమాకి కూడా రీసెంట్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 25వ తేదీన
ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను త్రినాథరావు నక్కిన
దర్శకత్వంలో చేస్తున్నాడు. 'ధమాకా' టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ
సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది. ఇక 'రావణాసుర' .. 'టైగర్
నాగేశ్వరరావు' ప్రాజెక్టులను కూడా రవితేజ లైన్లో పెట్టేసిన సంగతి
తెలిసిందే.