సినీఛాన్స్ పేరిట 30 మందితో ఆటాడిన రావణుడు

Sun Jul 12 2020 19:40:00 GMT+0530 (IST)

Ravan played with 30 people under the name of Cine Chance

సినిమా అవకాశం పేరుతో మోసాలు రోజురోజుకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. గ్లామర్ రంగంలోకి కళంకితుల రంగ ప్రవేశం .. అటుపై మోసాలు ఈ రంగానికే చెడ్డ పేరు తెస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సినిమా వాళ్లు! అంటూ వేలెత్తి చూపే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే పలువురు మోసగాళ్ల భారిన పడి ఆర్థికంగానూ.. శారీరకంగానూ దోపిడీకి గురవుతున్న యువతులు పోలీస్ గడప తొక్కుతున్నారు.తాజాగా అలాంటి మోసమే బయటపడింది. గుంటూరుకి చెందిన ఓ డైరెక్టర్ ఇలాంటి నాటకమే ఆడాడు. సినిమా ఛాన్స్ పేరుతో ఏకంగా 30 మంది ఆర్టిస్టుల్ని బురుడీ కొట్టించి వారి వద్ద ఒక్కొక్కరి నుంచి 35 వేల చొప్పున గుంజాడు. ఆ మొత్తంతో ఉడాయించాడు. ఇదిగో మేక అంటే అదిగో పులి! అన్న చందంగా నాటకాలాడి నట్టేట ముంచాడు. ఇందులో విజయవాడ నుంచి గుంటూరు బెల్టు యువతీయువకులు ఉన్నారు. చైతన్య క్రియేషన్స్ బ్యానర్ పై `ఆత్రేయ పురం ప్రేమకథ` టైటిల్ తో ఇప్పటికే సినిమా తీస్తున్నాడు ఇతగాడు. పూర్తిగా తీసేది లేదు కానీ.. మధ్యలోనే వైకుంఠం చూపిస్తున్నాడట.

ఇంతకీ ఆయన పేరేమి? అంటే.. రావణ్ భిక్షు. పేరుకు తగ్గట్టే రావణాసురుడు అని తేలింది. ఆ మేరకు ప్రముఖ టీవీ చానెల్ కథనంలో అతగాడి లీలలెన్నో బయటపడ్డాయి. సినిమా ఛాన్స్ పేరిట పలువురు యువతుల్ని శృంగార ముగ్గులోకి దించాడట ఇతగాడు. సదరు వార్తా చానెల్ వాళ్లు ముఖానికి మాస్క్ వేయకుండానే అతగాడి ఫోటోని లైవ్ లో వేసి ఆడుకోవడంతో అడ్డంగా బుక్కయ్యాడు. రావణ్ తరహా కేటగిరీ కేటుగాళ్లు బెజవాడ- గుంటూరు సహా తిరుపతి లాంటి చోట ఇంతకుముందు పలువురు పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే.