బిగ్‌బాస్ : రమ్య కృష్ణకు అరుదైన రికార్డ్

Mon Nov 29 2021 06:59:24 GMT+0530 (IST)

Rare record for Ramya Krishna

ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇండియాలో హిందీ బిగ్ బాస్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. తెలుగు మరియు తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ మద్య కాలంలో బిగ్ బాస్ ప్రారంభం అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఈ ఏడాది 5వ సీజన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.తెలుగు బిగ్ బాస్ కు మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు.. రెండవ సీజన్ లో నాని హోస్టింగ్ చేయగా మూడవ.. నాల్గవ మరియు అయిదవ వరుసగా మూడు సీజన్ లకు కూడా నాగార్జున హోస్టింగ్ చేశాడు.. చేస్తున్నాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 వరకు ముగ్గురు హోస్ట్ లు వచ్చారు. కాని తమిళంలో మాత్రం ఒకే ఒక్క హోస్ట్ ఆయనే లోక నాయకుడు కమల్ హాసన్.

తమిళంతో పాటు దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న కమల్ హాసన్ అరవ బిగ్ బాస్ ను సూపర్ హిట్ గా తీసుకు వెళ్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా షో ను మాత్రం వీడలేదు. కాళ్లు సహకరించకుంటే స్టేజ్ పై చైర్ లో కూర్చుని హోస్టింగ్ చేశాడు.

అన్ని రకాలుగా బిగ్ బాస్ ను టాప్ రేటింగ్ లో ఉంచడంలో కమల్ హాసన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. దాంతో బిగ్ బాస్ రాబోయే రెండు వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ పరిస్థితి ఏంటీ అంటూ అంతా ఆలోచనలో పడ్డారు. షో నిర్వాహకులు శృతి హాసన్ ను సంప్రదించారనే వార్తలు వచ్చాయి. కాని కమల్ ప్లేస్ ను సీనియర్ స్టార్ హీరోయిన్.. శివగామి దేవి రమ్య కృష్ణ రిప్లేస్ చేసింది.

కరోనాతో ఐసోలేషన్ కు వెళ్లి పోయిన కమల్ హాసన్ తాజా వీకెండ్ ఎపిసోడ్ ను వీడియో చాట్ ద్వారా మొదలు పెట్టి ప్రేక్షకులకు మరియు ఇంటి సభ్యులకు రమ్యకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నట్లుగా చెప్పాడు. రమ్యకృష్ణ ను స్టేజ్ పై చూసిన వెంటనే కంటెస్టెంట్స్ ఆశ్చర్యపోయారు.

కమల్ హాసన్ పూర్తి నమ్మకంతో రమ్యకృష్ణకు ఈ బాధ్యత అప్పగించాడు. గతంలో ఆమె తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించింది. కనుక ఖచ్చితంగా తమిళంలో కూడా ఆమె ఖచ్చితంగా కుమ్మేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే కమల్ లేని లోను ఆమె పూడ్చింది. ఈ సమయంలో రమ్యకృష్ణ కు అరుదైన రికార్డు నమోదు అయ్యింది. తెలుగు మరియు తమిళ బిగ్ బాస్ లకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది.

ఒక భాష హోస్ట్ మరో భాష లో హోస్ట్ గా వ్యవహరించిన దాఖలాలు బిగ్ బాస్ లో లేవు. ఎప్పుడైనా గెస్ట్ గా వచ్చి ఉంటారు కాని రమ్యకృష్ణ మాత్రం రెండు భాషల్లో కూడా హోస్ట్ గానే వ్యవహరించింది. అలా రమ్యకృష్ణ కు ఈ రికార్డు దక్కింది.