రాపో 19 టైటిల్ ..అండ్ ఇంట్రెస్టింగ్ డిటైల్స్

Mon Jan 17 2022 11:29:18 GMT+0530 (IST)

Rapo 19 Title ..and Interesting Details?

ఇస్మార్ట్ శంకర్ రెడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత హీరో రామ్ మరో సారి మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం రామ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగుసామి డైరెక్షన్ లో ఓ హై వోల్టేజ్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని రోజులు చిత్రీకరణ ఆలస్యమైన  ఈ మూవీ ఆ తరువాత నిర్మాత కె. ఇ. జ్ఞానవేళ్ రాజా దర్శకుడు ఎన్ లింగుసామి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.ఆ తరువాత హీరో రామ్ కు గాయం కావడంతో మరి కొంత సమయం షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. తాజాగా హీరో రామ్ కోలు కోవడంతో ఈ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో `ఉప్పెన` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఈ సోమవారం జనవరి 18న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన డిటైల్స్ బయటికి వచ్చేశాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి `వారియర్` అనే టైటిల్‌ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. `#RAPO19` గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ భాషలోనూ ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీర్ గా కనిపించబోతున్నారట.

ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీతో తన మార్కెట్ ని పెంచుకోవాలని రామ్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లో నూ తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలన్న ఉద్దేశంతో రామ్ చేస్తున్న ఈ మూవీ ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దర్శకుడు ఎన్. లింగుసామి ట్రాక్ రికార్డ్. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ లని అందించిన లింగు సామి గత కొంత కాలంగా దర్శకుడిగా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు.

ఇటీవల ఆయన చేసిన రెండు చిత్రాలు తెలుగుతో పాటు తమిళంలోనూ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. సూర్యతో చేసిన సికిందర్ విశాల్ తో చేసిన `పందెంకోడ -2` చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యాయి. కానీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ఇదే ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తోంది. అయితే లింగుసామి .. రామ్ కోసం ఎంచుకున్న కథ అతని పాత్రని మలిచిన తీరు మాత్రం సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ మూవీ రామ్ కు రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు మంచి మార్కెట్ ని ఏర్పరచడం ఖాయం అని చెబుతున్నారు.

లింగు సామి గత చిత్రాలకు మించిన యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అన్బు - అరివు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు.