అమ్మో ఆ సంగతి చెప్పకపోతే దీపిక ఊర్కుంటుందా?: రణ్ వీర్ సింగ్

Thu Oct 14 2021 07:00:01 GMT+0530 (IST)

Ranveer answered many questions in Instagram platform

బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకునే కథానాయికగా దీపిక పదుకొనే కనిపిస్తుంది. ఇక అక్కడి స్టార్ హీరోలలో రణ్ వీర్ తన ప్రత్యేకతను చాటుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి తరువాత కూడా ఆ ప్రేమ తగ్గకుండా చూసుకుంటున్నారు. వాళ్లు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేయడమే కాదు తాము చేసే పనిని కూడా అదే స్థాయిలో ప్రేమిస్తూ ఉంటారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉంటూ అంకితభావంతో వాటిని పూర్తిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ ఒక టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నాడు.' ది బిగ్ పిక్చర్' అనే ఒక క్విజ్ ప్రోగ్రామ్ కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇలా రణ్ వీర్ ఒక టీవీ షోకి పనిచేయడం ఇదే మొదటిసారి. అయినా తనదైన స్టైల్లో రక్తి కట్టించడానికి తనవంతు కృషి చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఇన్ స్టా వేదిక ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు రణ్ వీర్ సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలోనే గతంలో దీపిక - రణవీర్ ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఒక ఫొటోను ఒక నెటిజన్ పంపించాడు. ఆ ఫొటోను ఎప్పుడు .. ఏ సందర్భంలో తీసుకున్నారు? అంటూ ప్రశ్నించాడు.


అందుకు రణ్ వీర్ తనదైన స్టైల్లో సమాధానం చెబుతూ .. "ఆ ఫొటో గురించి నేను తప్పకుండా చెప్పాలి .. లేదంటే ఇంటికి వెళ్లగానే దీపికా నన్ను కొట్టేస్తుంది. మా తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్లి వస్తే బాగుంటుందని అనుకున్నాము. అలా అనుకున్న తరువాత మా మనసులో అమృత్ సర్ .. తిరుమల వంటి ప్రదేశాలు అయితే బాగుంటుందనే అభిప్రాయం కలిగింది. ఉత్తర .. దక్షిణ భారతాలకి చెందిన మేమిద్దరం ఆ ప్రదేశాలను దర్శించాలనే నిర్ణయానికి వచ్చాము. అలా మా ప్రయాణం కొనసాగింది.

ముందుకు అనుకున్నట్టుగానే 'అమృత్ సర్'లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాము. ఆ తరువాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాము. ఆ సమయంలో తీయబడిన ఫొటో అది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రణ్ వీర్ చేతిలో నాలుగైదు హిందీ సినిమాలు ఉన్నాయి. నవంబర్ నుంచి ఈ సినిమాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముఖ్యంగా తాను .. దీపిక కలిసి నటించిన '83' సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.