క్రియేటివ్ డైరెక్టర్ ఎమోషనల్ డ్రామా రక్తి కట్టిస్తుందా?

Mon Mar 20 2023 21:40:04 GMT+0530 (India Standard Time)

Rangamarthanda Trailer A Rollercoaster Of Emotions

తనదైన సృజనాత్మకతతో ఎన్నో కళాత్మక చిత్రాలను తెరకెక్కించిన కృష్ణవంశీ కెరీర్ ఇటీవలి కాలంలో ఆశించిన విజయం దక్కక డైలమాలోనే కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ఆశించిన మ్యాజిక్ చేయడంలో చాలా కాలంగా తడబడ్డాడు. కానీ అతడు కొంత ఆలస్యంగా అయినా ఇప్పుడు ఒక కళాఖండాన్ని తెరకెక్కించి విజయం సాధించాలని కలలుగంటున్నాడు. మారిన ఫేజ్ లో తనకో హిట్టొస్తుందని కెరీర్ లో జోష్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. మేకింగ్ కోసం చాలా సమయం తీసుకున్నా ప్రతి ఫ్రేమ్ ని ఎమోషన్ తో నింపేసి ఒక అద్భుతమైన సినిమాగా రంగ మార్తాండను మలిచాడని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో జాతీయ అవార్డ్ నటుడు ప్రకాష్ రాజ్ - వెటరన్ నటి రమ్యకృష్ణ - బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ తో మైమరిపించింది. ఒక నటుడి జీవితంలో ఎన్నో సంఘటనల సమాహారంగా రంగమార్తాండ తెరకెక్కింది. జీవితానుభవాలు ఎమోషన్ తో ముడిపడిన ముడిసరుకుతో క్రియేటివ్ డైరెక్టర్ ఈసారి ఒక మంచి సినిమాని తెరకెక్కించాడని ఇటీవలి ప్రివ్యూల నుంచి టాక్ వినిపిస్తోంది.గత వారం రోజులుగా బయ్యర్లు .. సినీప్రముఖులు .. సోషల్ మీడియా ప్రముఖులు సహా పలువురి కోసం స్పెషల్ స్క్రీనింగులు వేసిన కృష్ణవంశీ బృందానికి ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ బుధవారం (22 మార్చి) రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా ఈ సినిమా థియేట్రికల్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలన్న ఆసక్తి సినీవర్గాల్లో కృష్ణవంశీ అభిమానుల్లో ఉంది. పాజిటివ్ మౌత్ టాక్ తో మంచి హిట్టు కొట్టగలమని పెళ్లి చూపులు - బలగం లాంటి సినిమాలు నిరూపించాయి. మంచి కథ కంటెంట్ తో అత్యుత్తమ నట ప్రదర్శనలతో ఈ సినిమాలు మెప్పించాయి. మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో పెద్ద విజయం సాధించాయి. అదే రీతిన ముందస్తు ప్రచారం చేసుకున్న రంగ మార్తాండ కు ఇది ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.

కృష్ణవంశీ గ్రేట్ కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ ఈ సినిమా అతడి ఫేట్ ని మారుస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి. రంగ మార్తాండతో ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టి తీరాలని కసితో తీసాడు. ఇందులో తన సతీమణి రమ్యకృష్ణ ఎమోషన్ ని పండించే పాత్రలో కనిపించనుండగా.. మూవీ ప్రధాన థీమ్ ఆద్యంతం ప్రకాష్ రాజ్ అభినివేశం చుట్టూనే తిరగనుంది. బ్రహ్మానందం మునుపెన్నడూ లేనంత కొత్తగా ఎమోషనల్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారని ట్రైలర్ వెల్లడించింది.

ఇది అమ్మానాన్నలతో కలిసి చూడదగ్గ చిత్రమిదని పోస్టర్లలో ప్రచారం చేస్తున్నారు. అయితే సినిమా ఆద్యంతం ఎమోషన్ ని రగిలించినా భారీ ఓపెనింగులు సాధించడానికి ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. మౌత్ టాక్ మంచి సమీక్షలు ఈ సినిమాని హిట్టు చేయగలవు. దాస్ కా ధమ్కీ లాంటి కమర్షియల్ సినిమా పోటీలో ఉన్నా మారిన ట్రెండ్ లో ఇప్పుడు మంచి కంటెంట్ తోనే హిట్టు కొట్టాల్సి ఉంది. ఆరంభమే హిట్ అన్న టాక్ రావాలి.

మరాఠీ చిత్రంగా వచ్చిన నానా పటేకర్ `నట సామ్రాట్` కథాంశాన్ని తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించగా ఇందులో ప్రకాష్ రాజ్ ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. అయితే డ్రామా ఆర్టిస్టు కుటుంబం అతడి వల్ల సంతోషంగా లేనందున తన వ్యక్తిగత జీవితంలో వైఫల్యంతో ముడిపడిన ఎమోషన్ తెరనిండుగా కనిపించనుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న `ఆ నలుగురు` తరహా లైన్ ని ఎంచుకున్నా కానీ ఇక్కడ పూర్తిగా రంగస్థల నేపథ్యంలోని ఎమోషన్ పైనే కృష్ణవంశీ గురి. అది తెరపై వర్కవుటై కాసుల వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నాడు. రమ్య కృష్ణ -అనసూయ భరద్వాజ్-రాహుల్ సిప్లిగంజ్- శివాత్మిక రాజశేఖర్ తదితరులు ఇందులో నటించారు. ఇళయరాజా సంగీతం అందించగా- రాజ్ కె నల్లి ఛాయాగ్రహణం అందించారు. రాజా శ్యామలా ఎంటర్ టైన్ మెంట్స్- హౌస్ఫుల్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా విడుదలవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.