Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : రంగమార్తాండ

By:  Tupaki Desk   |   22 March 2023 11:59 PM GMT
మూవీ రివ్యూ : రంగమార్తాండ
X
'రంగమార్తాండ' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ-బ్రహ్మానందం-శివాత్మిక రాజశేఖర్-ఆదర్శ్ బాలకృష్ణ-అనసూయ భరద్వాజ్-తనికెళ్ల భరణి-రాహుల్ సిప్లిగంజ్-అలీ రెజా తదితరులు
సంగీతం: ఇళయరాజా
ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి
మాటలు: ఆకెళ్ళ శివప్రసాద్
నిర్మాతలు: కాలీపు మధు-వెంకట్ రెడ్డి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కృష్ణవంశీ

గులాబి మొదలుకుని.. చందమామ వరకు ప్రత్యేకమైన శైలిలో సినిమాలు తీసి బలమైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు కృష్ణవంశీకి చాలా కాలంగా సరైన విజయం లేదు. ఈసారి ఆయన చాలా గ్యాప్ తీసుకుని మరాఠీ చిత్రం 'నటసామ్రాట్'ను 'రంగమార్తాండ' పేరుతో రీమేక్ చేశారు. ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఉగాది కానుక ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

రాఘవరావు (ప్రకాష్ రాజ్) 40 ఏళ్ల తన నాటక రంగ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసి.. గొప్ప పేరు సంపాదించి.. 'రంగమార్తాండ' అనే బిరుదు సంపాదిస్తాడు. ఆ బిరుదు అందుకునే క్రమంలోనే ఇక తాను నటనకు సెలవు ఇచ్చేస్తున్నానని.. ఇక నిజ జీవితంలో పాత్రలకు న్యాయం చేస్తానని చెప్పి వేదిక మీది నుంచి నిష్క్రమిస్తాడు. అక్కడి నుంచి రాగానే తన ఇంటిని కోడలి పేరిట రాసేసి.. మిగిలిన డబ్బు.. నగలన్నీ కూతురికి ఇచ్చేసి ఆమెకు ఇష్టమైనవాడితో పెళ్లి చేస్తాడు. ఐతే తనకంటూ ఏమీ ఉంచుకోకుండా అన్నీ త్యాగం చేసిన రాఘవరావుకు తర్వాత సమస్యలు మొదలవుతాయి. భార్యతో కలిసి తన ఇంట్లోనే ఉండలేక బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కూతురి ఇంటికి చేరితే అక్కడా సమస్యలు తప్పవు. మరి రాఘవరావుకు అంతటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికి కారణాలేంటి.. చివరికి ఆయన జీవితం ఏ మలుపు తిరిగింది అన్నది తెర మీదే చూడాలి.


కథనం-విశ్లేషణ:

'రంగమార్తాండ'లో ఓ సన్నివేశం.. జీవితంలో అన్నీ కోల్పోయి.. బతుకు మీద ఆశలేక.. ఎలా చావాలో కూడా తెలియక సతమతం అవుతున్న చక్రి (బ్రహ్మానందం) ఆసుపత్రి బెడ్డు మీద ఉంటాడు. ఎదురుగా అతడి ప్రాణ స్నేహితుడు రాఘవరావు (ప్రకాష్ రాజ్). ''డాక్టర్లు ఏమన్నార్రా'' అని చక్రి అడిగితే''ఈ రోజు రాత్రి గడవడం కష్టమే అన్నారురా'' అంటాడు రాఘవ. ఇద్దరూ భళ్లుమని నవ్వుకుని పాత జ్ఞాపకాల్లోకి వెళ్తారు. అమెరికాలో వేసిన ఒక నాటకాన్ని గుర్తు తెచ్చుకుని.. బ్యాగ్రౌండ్లో కరతాళ ధ్వనులు వినిపిస్తుండగా.. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్యపై ఉన్న దుర్యోధనుడు.. అతణ్ని చూసేందుకు వచ్చిన కర్ణుడు పాత్రల్లో ఒకప్పుడు తామిద్దరం అభినయించిన వైనాన్ని మళ్లీ కళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు ఆ ఇద్దరూ. పది నిమిషాలకు పైగా సాగే ఈ సన్నివేశంలో ప్రకాష్ రాజ్-బ్రహ్మానందంలను చూస్తే.. వీళ్లు కదా నటులంటే.. ఇది కదా అభినయం అంటే.. ఇది కదా డైలాగ్ డెలివరీ అంటే.. ఇది కదా సన్నివేశం అంటే.. ఇది కదా ఎమోషన్ అంటే అనిపించకుండా ఉండదు. ఆ సీన్ చివర్లో బతకడానికి.. చావడానికి ఒకే రకంగా భయపడుతున్న తనకు ముక్తిని ప్రసాదించమని బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ను వేడుకోవడం.. ఆ తర్వాత ఆ సన్నివేశానికి ఇచ్చిన ముగింపు చూశాక ఎలాంటి ప్రేక్షకుడికైనా కళ్లు చెమర్చకపోవు. ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన కృష్ణవంశీకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.

నాటకం.. అంటేనే కాలం చెల్లిన మాట. ఒక రంగస్థల నటుడు ప్రధాన పాత్రధారిగా కన్నీళ్లు పెట్టించే సినిమా తీస్తానని అంటే పిచ్చోడిని చూసినట్లు చూసే కాలమిది. ఇదే కథతో తెరకెక్కిన మరాఠీ చిత్రం 'నటసామ్రాట్'ను తెలుగులో రీమేక్ చేయాలని కృష్ణవంశీ అనుకుంటే.. రమ్యకృష్ణ ఆ సినిమా చూసి ఈ రోజుల్లో ఇదెవ్వరు చూస్తారు అని తీసి పడేసిందట. అయినా కృష్ణవంశీ మొండిగా అడుగేశాడు. ఇద్దరు నిర్మాతలు ధైర్యం చేసి పెట్టుబడి పెట్టారు. ఐతే కెరీర్లో ఎప్పుడూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా.. రాజీ అన్నదే లేకుండా తాను ఏం నమ్మాడో అది తీస్తూ వచ్చిన కృష్ణవంశీ.. ఈసారి కూడా అదే బాటలో నడిచాడు. 'కమర్షియల్' కోణాల గురించి ఆలోచించకుండా విలువలతో కూడిన కథను తెరపై ఆవిష్కరించాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న పాయింట్ మీద.. ఒక మామూలు కథనే హృద్యంగా తీర్చిదిద్దాడు కృష్ణవంశీ.

కథగా చూస్తే 'రంగమార్తాండ' ఏమాత్రం కొత్తగా అనిపించదు. ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో ప్రధాన పాత్రను రంగస్థల నటుడిగా చూపించడమే కాస్త భిన్నమైన విషయం. అంతకుమించి ప్రేక్షకులు కొత్తగా ఫీలవడానికి ఏమీ కనిపించకపోవచ్చు. ఇందులో చూసిన సన్నివేశాల్లో చాలా వరకు ఎన్నోసార్లు చూసినవే. కానీ తెలిసిన కథనే చాలా నిజాయితీగా.. చూసిన సన్నివేశాలనే మంచి ఎమోషన్ తో తెరకెక్కించాడు కృష్ణవంశీ. కొలిచినట్లుగా రాసిన అర్థవంతమైన సంభాషణలు ప్రతి సన్నివేశానికీ అలంకరణగా మారాయి. నటనకు వీడ్కోలు పలికిన వెంటనే తన ఆస్తులన్నింటినీ పిల్లలకు రాసిచ్చేయడంతోనే.. తర్వాత ఏం జరగబోతోందన్నది ఒక అంచనాకు వచ్చేస్తుంది. రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరున్న వ్యక్తి.. నిజ జీవితంలో నటించలేక ఎలా ఇబ్బంది పడతాడు.. ఈ రంగస్థలంలో ఎలా ఓడిపోయి నిష్క్రమిస్తాడనే వైనమే తర్వాతి కథ. సన్నివేశాలు కొత్తగా అనిపించకపోయినా.. పాత్రధారుల అద్భుతమైన నటన.. చక్కటి సంభాషణల వల్ల ఎమోషన్ క్యారీ అవుతుంది. ఆధునికత పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం.. తల్లిదండ్రుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాం అనే ప్రశ్నలు రేకెత్తించి.. ఒక ఆలోచనతో.. భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది 'రంగమార్తాండ'. మొదట్లోనే చెప్పుకున్న బ్రహ్మానందం హాస్పిటల్ సన్నివేశం సహా స్టాండౌట్ గా నిలిచే సీన్లు.. డైలాగులు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఇది లోపాల్లేని సినిమా కాదు. ట్రెండీగా అనిపించకపోవచ్చు. రొటీన్ కథ.. స్లో నరేషన్.. సెంటిమెంట్ ఎక్కువైంది.. మరీ ప్రీచీగా ఉంది.. అనే కంప్లైంట్లు కూడా ఉండొచ్చు.. కానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం 'రంగమార్తాండ' కచ్చితంగా మిగులుస్తుంది. మంచి సినిమాలు రావట్లేదని అనే వాళ్లు ఓటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్లకు వెళ్లి ప్రోత్సహించాల్సిన సినిమా 'రంగమార్తాండ'.


నటీనటులు:

ఈ మధ్యే వచ్చిన 'వారసుడు' సహా చాలా సినిమాల్లో ప్రకాష్ రాజ్ వేస్తున్న రొటీన్ పాత్రలు చూసి విసుగెత్తిపోయిన వాళ్లంతా 'రంగమార్తాండ'కు వెళ్తే ఆయనలోని అద్భుతమైన నటుడిని మళ్లీ దర్శించవచ్చు. తనలో చాలా కాలంగా నిద్ర పోతున్న మహానటుడిని మళ్లీ ఆయన బయటికి తీశారు. ఇందులో ఆయన గెటప్ ఏమీ కొత్తగా అనిపించదు.. పాత్ర కూడా టిపికల్ గా ఉండదు.. అయినా సరే ఆయన నటన అద్భుతంగా అనిపిస్తుంది. మెలోడ్రామాతో ముడిపడ్డ సన్నివేశాల్లో ఏమాత్రం నాటకీయత లేకుండా సహజమైన నటనతో వాటిని పండించిన విధానానికి ఫిదా అవుతాం. ఇక సినిమాలో అత్యంత ఆశ్చర్యపరిచేది.. చాన్నాళ్లు గుర్తుండిపోయేది చక్రిగా బ్రహ్మానందం చేసిన పాత్ర. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ఎంతగానో నవ్వించాడు కానీ.. ఇంతలా ఏడిపించిన సినిమాలు అరుదు. ఈ సినిమా చూశాక కొన్ని రోజులు బ్రహ్మానందం కమెడియన్ అని మర్చిపోతామేమో. మనం రోజూ కామెడీ సీన్లలో.. మీమ్స్ లో చూసి పగలబడి నవ్వేది ఈ బ్రహ్మిని చూసేనా అనిపిస్తుంది. అంతలా ఇందులో హృదయాన్ని మెలిపెడతాడు బ్రహ్మి. కృష్ణవంశీ ఇంటర్వ్యూల్లో చెప్పినట్లే రమ్యకృష్ణ అరుపులు కేకలు లేకుండా కళ్లతోనే నటించింది ఈ సినిమాలో. ఆమె లుక్ కూడా బాగా కుదిరింది. అనసూయ.. శివాత్మిక రాజశేఖర్.. ఆదర్శ్ బాలకృష్ణ.. రాహుల్ సిప్లిగంజ్.. అలీ రెజా.. వీళ్లంతా పాత్రలకు తగినట్లు నటించారు.


సాంకేతిక వర్గం:

తాను తీస్తున్నది ఎలాంటి సినిమానో అర్థం చేసుకుని అందుకు తగ్గట్లే ఇళయరాజాను ఏరి కోరి ఎంచుకున్న కృష్ణవంశీ.. ఆయన్నుంచి హృద్యమైన సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఒకప్పటిలా ఫాంలో లేకపోయినా.. తన మనసుకు నచ్చిన సినిమాకు మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇస్తారు మేస్ట్రో. తనే పాడిన 'ఆరారారో' పాటతో ఆయన సినిమాను ముందుకు నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాటను బిట్లు బిట్లుగా బాగా వాడుకున్నారు. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం కూడా ఓకే. రాజ్.కె.నల్లి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడిగా కృష్ణవంశీ అత్యుత్తమ ప్రతిభ ఇందులో కనిపించకపోవచ్చు కానీ.. 'నట సామ్రాట్'ను మన నేపథ్యానికి తగ్గట్లు అన్వయించిన తీరు.. అద్భుతమైన సంభాషణలు.. పాటలు రాయించుకుని.. నటీనటుల నుంచి గొప్ప నటనను రాబట్టుకున్న విషయంలో ఆయన అభినందనీయుడు. కృష్ణవంశీ మార్కు సినిమా కాదు కానీ.. చాలా ఏళ్ల తర్వాత ఆయన్నుంచి వచ్చిన మంచి సినిమా ఇది. ఆయన అభిమానులు 'హి ఈజ్ బ్యాక్' అనొచ్చు.

చివరగా: రంగమార్తాండ.. రంగులేయని స్వచ్ఛమైన సినిమా

రేటింగ్-3/5