ఆ విషయంలో రానా తన మాట కూడా వినడంటున్న సరేశ్ బాబు

Wed Jul 21 2021 08:45:27 GMT+0530 (IST)

Rana did not listened to his father in that regard

ఊరందరికి పెద్ద మనిషి. ఆయన నోట్లో నుంచి మాట వస్తుందంటే చాలు.. రెండు చెవుల్ని రిక్కించి మరీ శ్రద్ధగా వినే క్రెడిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్దిమందిలోనే ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు. అందరిని కలుపుకుపోవటం.. ఎవరితోనే ప్రత్యేకించి విభేదాలు పెట్టుకోకపోవటం ఆయన ప్రత్యేకతగా చెప్పొచ్చు. బడా నిర్మాతగానూ.. కాలానికి తగ్గట్లు ఇట్టే మార్పు చేసుకునే తెలుగు సినిమా వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఏదైనా తేలని ఇష్యూలను.. కొరుకుడుపడని వ్యవహారాల్ని ఆయన వద్దకు వెళ్లి.. సలహాలు.. సూచనలు తీసుకోవటం చాలామందే చేస్తారు. ఫోన్ కాల్ దూరంలో ఉంటూ పెద్ద మనిషిగా సురేశ్ బాబుకు మంచి పేరుంది.సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకున్న పట్టు.. జడ్జిమెంట్ ను ఎవరూ వంక పెట్టలేరు. అలాంటి సురేశ్ బాబు పెద్ద కొడుకు రానా. అలియాస్ రీల్ భల్లాలదేవుడు. విలక్షణమైన చిత్రాల్ని చేస్తూ.. ఇండస్ట్రీలో మిగిలిన నటులకు భిన్నమైన ముద్ర అతగాడి సొంతం. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే రానా గురించి సురేశ్ బాబు సరికొత్త విషయాన్నిరివీల్ చేశారు. సినిమాల విషయంలో రానా ఎవరి మాట వినడని చెప్పిన ఆయన.. కెరీర్ ప్రారంభం నుంచి తనకు తోచినట్లే నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

ఫలానా సినిమా చేయమని చెబితే రానా అస్సలు వినడని.. తనకు కావాల్సినట్లే చేస్తాడని చెప్పిన సురేశ్ బాబు.. ‘‘తనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. వాటిని బట్టే నిర్ణయం తీసుకుంటాడు. పలానా సినిమా చేయ్.. పాత్ర చేయమని చెప్పినా వినడు. కాకుంటే.. తాను చేసే సినిమాల గురించి పాత్రల గురించి చెబుతాడంతే. మేం కూడా సరే అంటాం. తను చేసిని సినిమాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అతనివే. రానా కలల్ని సాకారం చేయటం కోసం మా వంతు సాయం మేం చేస్తామంతే’’ అంటూ కొడుకు గురించి సురేశ్ బాబు సరికొత్త విషయాల్ని పంచుకున్నారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తమ తండ్రి.. బాబాయ్.. పెద్ద నాన్న.. అన్న.. లాంటి వారు పెద్ద పొజిషన్ లో ఉంటే వారిని ఫాలో కావటం.. వారి సలహాలు.. సూచనల్ని ఫాలో కావటం సర్వ సాధారణం. అందుకు భిన్నంగా ఎవరి మాట వినకుండా.. తన నిర్ణయాల్ని తానే తీసుకోవటం చాలా తక్కువ. అలాంటి విలక్షణత భల్లాలదేవుడి సొంతమన్న విషయం రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు మాటలతో బయటకొచ్చిందని చెప్పాలి.