తమిళ దర్శకులపై పడ్డాడేంటీ?

Fri Jul 01 2022 05:00:01 GMT+0530 (IST)

Ram Pothineni with Gautham Menon

ఇస్మార్ట్ రామ్ పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ఒకటే పుకార్ షికార్ చేసింది. అయితే ఇంతలోనే రామ్ దీనిని ఖండించాడు. ఈ ఏడాది పెళ్లాడబోనని రామ్ అధికారికంగా వెల్లడించాడు. అదంతా సరే కానీ ఇదే పెళ్లి వార్తల నడుమ మరో ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.అతడు పెళ్లికి ముందే గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడనేది ఈ వార్త సారాంశం. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి తో ది వారియర్ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  వచ్చే నెలలో ఈ సినిమా విడుదలవుతుంది. ఇది రామ్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని భారీ బడ్జెట్ తో రూపొందుతున్న యాక్షన్ చిత్రమిదని ప్రచారం సాగుతోంది.

ఇంతలోనే క్లాస్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో క్లాసిక్ రొమాంటిక్ మూవీలో నటించేందుకు ప్లాన్ చేసాడని కథనాలు వైరల్ అవుతున్నాయి. గౌతమ్ తో పని చేయాలని రామ్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉన్నా ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.

ఇంతకాలానికి ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం కలిసి పని చేయనున్నారు. ఇప్పటికే గౌతమ్ లైన్ ని వినిపించి ఓకే చేయించుకున్నాడు. స్క్రిప్టు అభివృద్ధి దశలో ఉంది. ఇద్దరూ తమ ప్రస్తుత కమిట్ మెంట్ లను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాని ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గౌతమ్ మీనన్ మూవీ కంటే ముందే బోయపాటి శ్రీను దర్శకత్వంలోని సినిమాని రామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించి వేసవిలోపు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత తెలుగు -తమిళం బైలింగువల్ గా గౌతమ్ మీనన్ చిత్రాన్ని అతను ప్రారంభించనున్నాడు. అయితే గౌతమ్ మీనన్ క్లాస్ డైరెక్టర్. క్లాసిక్స్ ని తీస్తాడు. అతడు రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ చాలామంది  లవర్ బోయ్స్ తో గౌతమ్ పని చేసాడు. రామ్ తో అతడి కాంబినేషన్ ఆసక్తిని పెంచేదే. కానీ గౌతమ్ మీనన్ తో ఒకటే చిక్కు. సినిమా అనుకున్నంత వేగంగా పూర్తయి రిలీజ్ కి రావడం కష్టం. కొన్ని సినిమాలు ఏళ్లకు ఏళ్లు పట్టాయి. అందుకే రామ్ ఎలా మ్యానేజ్ చేస్తాడు? అన్నది వేచి చూడాలి.