అలాగైతేనే సినిమా చేస్తాడా.. రామ్ లో ఏంటీ ఛేంజ్?

Wed May 18 2022 17:00:02 GMT+0530 (IST)

Ram Pothineni Mass Movie

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రామ్.. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో  చాక్లెట్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు.అప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ లో మాత్రం మాస్ కుర్రాడిగా తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వెంటనే రామ్ 'రెడ్' అనే మరో మాస్ చిత్రం చేశాడు.

కానీ ఇది అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినప్పటికీ రామ్ కు మాస్ ఇమేజ్ పై మక్కువ తగ్గలేదు. పైగా రామ్ సినిమాల ఎంపిక చూస్తుంటే ఆయనలో చాలా ఛేంజ్ కనిపిస్తోంది. ఆయన కేవలం మాస్ సినిమాలైతేనే ఓకే చేస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను గమనిస్తే ఆ విషయం క్లియర్ కట్ గా అర్థమైపోతోంది. 'రెడ్' అనంతరం రామ్ తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామితో ఓ మూవీ అనౌన్స్ చేశాడు. 'ది వారియర్' టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంటే.. ఆది పినిశెట్టి విలన్ గా చేస్తున్నాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇది రిలీజ్ అయిన వెంటనే రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ మూవీని పట్టాలెక్కించనున్నాడు. రామ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఒక నయా మాస్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లక ముందే హరీష్ శంకర్ తో ఓ మూవీ చేసేందుకు రామ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఇది కూడా మాస్ ఎంటర్టైనర్ చిత్రమే అని ప్రచారం జరుగుతోంది.

కాగా ఇప్పటి వరకు మన తెలుగు చిత్రసీమలో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలన్నీ మాస్ మసాలా ఎంటర్టైనర్సే. అందుకే హీరోలు మాస్ ఇమేజ్ కోసం తెగ తాపత్రాయపడుతుంటారు. ఇప్పుడు రామ్ కూడా మాస్ మంత్రమే జపిస్తున్నాడు. మాస్ సినిమాలైతేనే ఓకే చేస్తున్నాడు. మరి మాస్ హీరోగా ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.