స్టార్స్ విడాకులు మంచిదే అంటున్న వర్మ

Tue Jan 18 2022 12:30:18 GMT+0530 (IST)

Ram Gopal Varma Sensational Post

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందు కలడు అందు లేడు అన్నట్లుగా ఏ టాపిక్ లో అయినా వేలు పెట్టి దాని మీద అడిగినా అడగకున్నా కూడా అభిప్రాయంను చెప్పేస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ నుండి అల్‌కాయిదా వరకు ప్రతి విషయం లో కూడా ఆయన జొరబడి మరీ తన వాదన వినిపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం తెగ చర్చ జరుగుతోంది. ఇటీవలే సమంత మరియు నాగ చైతన్యలు విడి పోయారు. నిన్నటికి నిన్న ధనుష్ మరియు ఐశ్వర్య లు విడి పోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక మరో పెద్ద కుటుంబంకు చెందిన జంట కూడా విడి పోతారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మెల్ల మెల్లగా స్పష్టత వస్తుంది. దాంతో విడాకుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ విడాకుల గురించి మాట్లాడకుండా ఉంటాడా.. అంతా అనుకున్నట్లుగా మాట్లాడాడు.రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల క్రితమే విడాకులు తీసుకుని తన సొంత జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నాం అంటే అవసరమా అంటాడు.. విడి పోతున్నాం అంటే వెరీ గుడ్ అంటాడు. తాజాగా విడాకుల విషయమై ఆయన స్పందిస్తూ.. స్టార్స్ విడాకులు తీసుకోవడం వల్ల మీడియాలో పబ్లిసిటీ వస్తుంది. తద్వార యువత పెళ్లి చేసుకునే విషయంలో ఆలోచిస్తారు అంటూ వర్మ వింత ట్వీట్ చేశాడు. అందుకే స్టార్స్ విడాకులు తీసుకోవడం వల్ల పెళ్లి వ్యవస్థ గురించి ప్రస్తుత యువత ఆలోచిస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఇంతకు మించి ఏం పెద్దగా మంచి స్పందిస్తాడు లే అంటూ కొందరు కామంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆయన తీరును తప్పుబడుతున్నారు.

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయికతో జరిగేది. దానికి సెలబ్రేషన్ అవసరం లేదు. కాని విడి పోవడం అనేది ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన విషయం అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ పెళ్లి గురించి మళ్లీ మళ్లీ వర్మ ఏదో ఒక సందర్బంలో తన అభిప్రాయంను చెబుతూనే ఉన్నాడు. తాజాగా పెళ్లి గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకు పెళ్లి అంటే ఎంత వ్యతిరేకమో అర్థం చేసుకోవచ్చు. ఈమద్య టికెట్ల రేట్ల విషయమై మంత్రి తో చర్చించడం.. మీడియాతో మాట్లాడటం వంటివి చేయడం వల్ల ఆయన గురించి ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. మళ్లీ దాన్ని చెడగొట్టుకుంటాడా లేదా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటాడా అనేది చూడాలి.