అలాగైతే మహర్షిని ఎవరూ చూడరంటున్న వర్మ

Mon May 27 2019 15:10:47 GMT+0530 (IST)

Ram Gopal Varma Sensational Comments On Maharshi Movie

తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పేయడం రామ్ గోపాల్ వర్మ నైజం. ఆయన మాట తీరు కొందరికి నచ్చుతుంది.. కొందరికి కోపం తెప్పిస్తుంది. ఎవరేం అనుకున్నా కూడా తాను అనుకున్నట్లుగానే మాట్లాడుతానంటూ వర్మ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రంపై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు సినిమాను సున్నితంగా విమర్శించాడు.తాజాగా వర్మ ఒకానొక సందర్బంగా మహర్షి సినిమా గురించి మాట్లాడుతూ... నాకు గ్రామాలన్నా పంట పొలాల నేపథ్యంలో సినిమాలన్నా కూడా పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే నేను ఎప్పుడు కూడా రైతు ఆధారిత.. వ్యవసాయ ఆధారిత కథలను ఎంపిక చేసుకోలేదు అన్నాడు. ప్రజలకు కూడా అలాంటి నేపథ్యం ఉన్న సినిమాలంటే పెద్దగా నచ్చదు. ఎక్కువ శాతం ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలనే కావాలనుకుంటారు.

ప్రేక్షకులు ఒక సినిమాలో హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ పాటలు ఫైట్లు ఉన్న విషయాన్ని చూసి సినిమాకు వెళ్తాడు. ప్రస్తుతం మహర్షి సినిమా కోసం ప్రేక్షకులు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసం వస్తున్నారని.. వారు మహేష్ బాబు పై అభిమానంతో వస్తున్నారు తప్ప సినిమాలో సందేశం బాగుందట అంటూ ఎవరు రావడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ మహర్షి చిత్రంలో మహేష్ బాబు లేకుంటే ఎంత మంది ఆ సినిమాను చూస్తారో చెప్పగలరా అంటూ ఈ సందర్బంగా వర్మ ప్రశ్నించాడు. మహర్షి చిత్రంలో సందేశం ఉన్నా కూడా ఎక్కువ శాతం మంది ఎంటర్ టైన్ మెంట్ కోసమే వెళ్తున్నారని వర్మ అన్నాడు.