దిశ ఎన్ కౌంటర్.. పోలీసులదే తప్పు!

Sat Dec 07 2019 12:30:30 GMT+0530 (IST)

Ram Gopal Varma Comments On Disha Case

దిశ ఘటనలో నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ఇటు కామన్ జనం.. అటు సెలబ్రిటీలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. హత్యాచారం చేసిన దుర్మార్గుల్ని ఇలా చేయడమే కరెక్ట్ అని అందరూ జడ్జిమెంట్ ఇచ్చేశారు. అయితే అందరూ వెళ్లిన దారిలో వెళితే ఆర్జీవీ ఎందుకు స్పెషల్ అనిపించుకుంటాడు. అందుకే ఆయన ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించారు.దిశ ఘటన లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని న్యాయ వ్యవస్థనే కించపరిచారని అలా చేయడం తగదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. పోలీసుల పనికి దేశం హర్షం వ్యక్తం చేస్తోంది కానీ వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని అన్నారు. దారుణాన్ని దృష్టి లో ఉంచుకుని ఎన్ కౌంటర్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేయడంలో న్యాయం ఉంది. కానీ చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోడం న్యాయ వ్యవస్థను కించపరచడమే అవుతుంది.

అంతేకాదు.. ఇలాంటి ఎన్ కౌంటర్ల వల్ల అనాగరిక వ్యవస్థలోకి వెళతామని ఆర్జీవీ ఘాటుగానే వ్యాఖ్యానించారు. నేరారోపణలకు సంబంధించి రకరకాల కోణాల్లో దర్యాప్తు సాగుతుంది. దానివల్ల తీర్పు ఆలస్యమవుతుంది. ఒక్క నిరపరాధి కూడా బలి కాకూడదన్న చట్టం వల్లనే ఇలా జరుగుతుందని తన నాలెజ్ ని ప్రజలకు విశదపరిచారు ఆర్జీవీ.

నేరానికి కారణం విఫలమైన వ్యవస్థ.. అందుకు బాధ్యులు ఎవరు? అన్న కోణాల్ని పరిశీలించాలని .. మూలాల నుంచి నేరాన్ని తొలగించాలని తన అభిప్రాయం చెప్పారు ఆర్జీవీ. క్రిమినల్స్ నేరాలను రూల్ ప్రకారమే బయట పెట్టాలి. పోలీసులు.. మీడియా .. ప్రజలు చెప్పారని వారిని శిక్షిస్తే సమాజం కుప్ప కూలిపోతుంది. దిశ ఘటనలో నిందితులు మరో నేరం చేసేలోపే వారిని అదుపు చేయడం కోసం పోలీసులు వారిని చంపేశారని ఆర్జీవీ అన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల న్యాయ వ్యవస్థ కు నేరం ఏమిటో తెలిసే అవకాశం లేదని అభిప్రాయ పడ్డారు. రూల్ ప్రకారం చట్ట ప్రకారం ఇలాంటి వాటిని విచారించాలని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జనాభిప్రాయానికి భిన్నంగా సావధానంగా ఆలోచనా పూరితంగా ఆర్జీవీ తన వ్యూని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేయడాన్ని మెచ్చాల్సిందే. న్యాయవ్యవస్థల విషయంలో ఆవేశం తగదన్న సూచన అంతర్లీనంగా ఆర్జీవీ మాటల్లో ధ్వనించింది. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నిరపరాధి శిక్షించబడడం సరికాదనే విషయాన్ని ఆర్జీవీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు తనదైన చాతుర్యంతో.