మాజీ ఎమ్మెల్యేకు నివాళ్లు అర్పించేందుకు బెంగళూరు వెళ్లిన చరణ్

Sat Nov 21 2020 18:00:14 GMT+0530 (IST)

Charan who went to Bangalore to pay tributes to former MLA

టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు భార్య.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ ఇటీవలే కరోనా నుండి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల వల్ల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె చివరి చూపు కోసం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ బెంగళూరు వెళ్లడం జరిగింది. ఆదికేశవులు నాయుడు కుటుంబంతో చిరంజీవి కుటుంబంకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంతోనే సత్యప్రభ మృతి పట్ల సంతాపం తెలియజేసేందుకు గాను చరణ్ బెంగళూరు వెళ్లారు.ఆదికేశవులు.. సత్యప్రభల తనయుడు డీకే శ్రీనివాస్ తో చరణ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు సుదీర్ఘ కాలంగా స్నేహితులు. తండ్రుల తరం నుండి కొనసాగుతూ వస్తున్న స్నేహంను చరణ్ కొనసాగించాడు. అందులో భాగంగానే స్నేహితుడి తల్లి మృతి చెందడంతో బెంగళూరు వెళ్లి నివాళ్లు అర్పించాడు. స్నేహితుడిని ఓదార్చడం కోసం చరణ్ అంత దూరం వెళ్లారా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చరణ్ గురించి గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ లో చరణ్ పాల్గొంటున్నాడు. త్వరలోనే ఆచార్య షూటింగ్ లో కూడా చరణ్ పాల్గొనాల్సి ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా చరణ్ బెంగళూరు వెళ్లారు అంటే మెగా ఫ్యామిలీకి వారు ఎంత దగ్గరో అర్థం చేసుకోవచ్చు.