Begin typing your search above and press return to search.

ఒకే క‌థ‌తో మూడు సినిమాలు.. నిఖిల్ కి ఊపిరాడేదెలా?

By:  Tupaki Desk   |   30 May 2023 6:00 AM GMT
ఒకే క‌థ‌తో మూడు సినిమాలు.. నిఖిల్ కి ఊపిరాడేదెలా?
X
వీర్ సావర్కర్ జీవితం ఇప్పుడు 3 భాషల్లో రూపొందుతోంది. తారాగణం- కథ వివ‌రాలు ఓపెన్ సీక్రెట్. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. వీర్ సావర్కర్ జీవిత కథను ఇప్పుడు తెలుగు- హిందీ- కన్నడ భాషల్లో విభిన్న దర్శకులు.. విభిన్న‌ నటీనటులతో రూపొందిస్తున్నారు. సావ‌ర్క‌ర్ జీవిత కథపై ఒకేసారి ఇంత‌మంది ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం వెన‌క అస‌లు సీక్రెట్ ఏమై ఉంటుంది? అంటే మ‌రింత లోతుగా డీటెయిల్స్ లోకి వెళ్లాలి.

తెలుగులో `ది ఇండియా హౌస్` పేరుతో నిఖిల్ క‌థానాయ‌కుడిగా బ‌యోపిక్ చిత్రాన్ని ఇటీవ‌లే చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. రామ్ చ‌ర‌ణ్ - అభిషేక్ నామా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కార్తికేయ 2తో ఉత్త‌రాదినా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న నిఖిల్ త‌దుప‌రి `స్పై` సినిమాతోను పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంత‌లోనే యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న వీర్ సావార్క‌ర్ క‌థ‌తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. ది ఇండియా హౌస్ టైటిల్ ఇప్ప‌టికే ద‌క్షిణాది ఉత్త‌రాది అన్నిచోట్లా అంద‌రి గుండెల్లోకి దూసుకెళ్లింది. వీర్ సావ‌ర్క‌ర్ జీవితంలో ఒక ప్ర‌ధాన ఘ‌ట్టం చుట్టూ అల్లుకున్న క‌థ‌తో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌య‌లో వీర్ సావ‌ర్క‌ర్ క‌థ‌తోనే హిందీలో ఒక చిత్రం.. క‌న్న‌డలో మ‌రో చిత్రం తెర‌కెక్కిస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. హిందీలో ర‌ణ‌దీప్ హుడా క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్` అనే టైటిల్ నిర్ణ‌యించారు. క‌థానాయ‌కుడే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. సావర్కర్ పాత్ర కోసం 25 కేజీల బ‌రువు త‌గ్గి ఫిట్ బాడీతో లుక్ మొత్తం మార్చేశాడు ర‌ణ‌దీప్ హుడా. సావర్కర్ 140వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఇప్ప‌టికే దూసుకెళ్లింది. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం విడుదల కానుంది.

అలాగే మ‌న పొరుగు భాష క‌న్న‌డ‌లో రాధాకృష్ణ పల్లకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వీర్ సావర్కర్ క‌థ‌తోనే రూపొందుతోంది. ఇంకా ఈ మూవీ టైటిల్ ను వెల్లడించలేదు. కన్నడ నటుడు సునీల్ రావ్ ఈ చిత్రంలో సావర్కర్ పాత్రలో న‌టిస్తుండ‌గా జాన్విక కలకేరి అతని భార్యగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో వీర్ సావర్కర్ - డాక్టర్ బిఆర్ అంబేద్కర్ - వీర సావర్కర్ భార్యలు -అతడి సోదరులు గణేష్ .. నారాయణ్ ల మధ్య ఉన్న సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టి తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం. వీర్ సావర్కర్ క‌న్నడ బయోపిక్ ఈ సంవత్సరం చివరిలో విడుదలవుతుంది. నాటి రాజకీయ కార్యకర్త సావ‌ర్క‌ర్ జీవితంపై లోతైన విష‌య‌ల‌ను తెర‌ప‌రిచే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది అని పల్లకి చెప్పారు. అయితే హిందీ వెర్ష‌న్.. క‌న్న‌డ వెర్ష‌న్ కంటే ముందే నిఖిల్ సినిమాని విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు చాలా కీల‌కంగా మారింది. ఒకేసారి మ‌రో ఇద్ద‌రితో పోటీప‌డుతూ నిఖిల్ బ‌రిలో దిగ‌డం సేఫ్ సైడ్ కాద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

ఒకే వీరుని క‌థ‌పై ఎందుకు అంత గురి?

వీర్ సావర్కర్ ప్ర‌జ‌ల హృద‌యాల్లో భావోద్వేగాలను రేకెత్తించే ఒక చారిత్రక యోధుడు. భారతదేశ చరిత్రలో అతడి స్థానం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. భారతదేశంలోని మూడు చలనచిత్ర పరిశ్రమలలో ఈ స్వాతంత్య్ర‌ సమరయోధుడు.. గొప్ప‌ కార్యకర్తపై మూడు సినిమాలు ఒకేసారి రూపొందుతున్నాయంటే స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 28 మే 2023 సావర్కర్ 140వ జయంతి సంద‌ర్భంగా భారతదేశ కొత్త పార్లమెంటు భవనం కూడా ప్రారంభమైంది.

క్లాసిక్ డేస్ నాటి సావర్కర్ జీవితం చాలా మందిని ఆకర్షించింది. ఎందుకంటే అతను హిందూ మహాసభకు అధిప‌తి.. హిందుత్వ అనే పదాన్ని సృష్టించిన వ్యక్తి. మహాత్మా గాంధీ హత్యానంతరం గాంధీ హత్యా కోణంలో ఆయన వివాదాస్పద వ్యక్తిగా మారారు. అయితే ఈ విచారణలో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మదన్ లాల్ ధింగ్రా- చంద్రశేఖర్ ఆజాద్- భగత్ సింగ్- సుఖ్ దేవ్- సుభాష్ చంద్రబోస్ వంటి అనేకమంది స్వాతంత్య్ర‌ సమరయోధులను సావర్కర్ ప్రేరేపించారని అంటారు. వీర్ సావర్కర్ కు గణేష్ - నారాయణ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు వారి భార్యలు అందరూ స్వాతంత్య్ర‌ ఉద్యమంలో పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ - గాంధీ - వీర్ సావర్కర్ అందరికీ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. వారి అభిప్రాయాలు ఆలోచనలు భారతదేశాన్ని అలాగే దేశ చరిత్రను డిజైన్ చేశాయి. డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి .. దళిత చైతన్యానికి క‌ర్త‌. అహింసా ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత గాంధీజీ. వీర్ సావర్కర్ హిందుత్వ ఆధారిత జాతీయవాదం క్రియాశీలతకు నాయకుడు. భారతదేశ చరిత్రలో వారి పాత్రలు.. వారి జీవితాలు చాలా మంది రచయితలు ద‌ర్శ‌క‌నిర్మాతలను ఆకర్షించాయి. ``సావర్కర్ నిజానికి ఇత‌ర యోదుల‌తో పోలిస్తే నమ్మశక్యం కాని జీవితాన్ని గడిపారు. నా సినిమా కోసం పరిశోధన చేస్తున్నప్పుడు అతని గురించి నేను మరింత లోతుగా తెలుసుకున్నాను. విపరీతంగా న‌చ్చారు ఆయ‌న‌. కాబట్టి అతని 140వ పుట్టినరోజు సందర్భంగా మా చిత్రానికి సంబంధించిన స్నీక్ పీక్ ను అందించ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింద‌``ని రణదీప్ హుడా హిందీ టీజ‌ర్ విడుదల సందర్భంగా తెలిపారు.