ఉస్తాద్ హీరోతో బోయపాటి మాస్ మసాలా మూవీ..?

Sat Jan 29 2022 15:00:01 GMT+0530 (IST)

Ram Boyapati Movie Update

'అఖండ' విజయంతో బోయపాటి శ్రీను మళ్లీ రేసులోకి వచ్చారు. కాకపోతే సినిమా వచ్చి దాదాపు రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్ పై అధికారిక చేయలేదు. అయితే ఉస్తాద్ హీరో రామ్ పొతినేనితో మాస్ డైరెక్టర్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.నిజానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను ఓ మూవీ చేయాల్సి ఉంది. 'పుష్ప' పార్ట్-1 తర్వాత ఈ ప్రాజెక్ట్ ని షురూ చేయాలని బన్నీ భావించారు. అయితే 'పుష్ప: ది రైజ్' అంచనాలకు మించి విజయం సాధించడంతో స్టార్ హీరో ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నాడు.

ముందుకు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రెండవ భాగాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇందులో పుష్పరాజ్ గెటప్ లోనే ఉండాలి కాబట్టి.. ఇది కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేసే అవకాశం లేదు. దీంతో బోయపాటి మరో ఏడాది పాటు తన 'సరైనోడు' హీరో డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ పోతినేనితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బోయపాటి ఊర మాస్ యాక్షన్ కథకు హీరో రామ్ ఎనర్జీ కలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ క్రమంలో బోయపాటి వంటి మాస్ దర్శకుడితో జోడీ కట్టడం వల్ల రాపో కంప్లీట్ మాస్ హీరోగా మారే అవకాశం ఉంది. అంతేకాదు తన మార్కెట్ కూడా మరింత విస్తరిస్తుంది.

బోయపాటి - రామ్ కాంబోలో తెరకెక్కే సినిమా కూడా బైలింగ్విల్ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. బోయపాటి శ్రీనుతో 'జయ జానకి నాయక' 'అఖండ' సినిమాలు నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.