Begin typing your search above and press return to search.

45 ఏళ్లుగా గ్యాప్ లేని నేను, 6 నెలలపాటు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది: రాజేంద్రప్రసాద్

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 AM GMT
45 ఏళ్లుగా గ్యాప్ లేని నేను, 6 నెలలపాటు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది: రాజేంద్రప్రసాద్
X
సందీప్ కిషన్ కథానాయకుడిగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' సినిమా రూపొందింది. కోన వెంకట్ - ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ద్వారా నేహా శెట్టి కథనాయికగా పరిచయమవుతోంది. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. వీవీవినాయక్ .. శ్రీవాస్ .. బాబీ .. విష్వక్ సేన్ .. తేజ సజ్జా .. బుచ్చిబాబు .. శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ .. 'గల్లీ రౌడీ' సినిమాను థియేటర్లలో ఎందుకు చూడాలి అనేది నేను చెబుతాను. 45 సంవత్సరాల కెరియర్లో ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకుంటూ వస్తున్న నేను, 6 నెలల పాటు ఖాళీగా ఇంట్లో ఉండేలా చేసిన కోవిడ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. కోవిడ్ వలన చాలా మంచి విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. కోవిడ్ వలన మిగతా పరిశ్రమల మాదిరిగానే సినిమా పరిశ్రమ కూడా దెబ్బతింది. ఏది శాశ్వతంగా ఉండిపోదు .. అలా మనకు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి.

థియేటర్లలోనే ఈ సినిమా చూడాలనుకున్నవారికి ఈ సినిమా ఒక పండగ అని నేను నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా కోసం పనిచేసేటప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, ఈ సినిమాను థియేటర్లలో చూస్తుంటే మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. మా టైము హీరోలకంటే ఇప్పుడున్న హీరోలు చాలా తెలివైనవాళ్లు .. వాళ్లకి ఏం కావాలనేది వాళ్లకి తెలుసు. అలా సందీప్ కిషన్ తనకి తగిన కథను తాను తెచ్చుకున్నాడు. ఇది నిజంగా ఆనందించవలసిన విషయం .. ఆయనను అభినందించవలసిన విషయం.

ఈ సినిమాను ఇంటిల్లిపాది కలిసి చూడవచ్చు. ఈ కథలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి. ఆ క్రెడిట్ కథ రాసినవారికి చెందుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారు మమ్మల్ని రేసు గుర్రాల్లా పరిగెత్తించారు. మా నుంచి మంచి అవుట్ పుట్ వచ్చేవరకూ ఆయన వదల్లేదు. ఈ నిర్మాతలను చూస్తుంటే, మా కాలం నిర్మాతలు గుర్తొచ్చారు. ఆర్టిస్టులను అంత బాగా చూసుకున్నారు. ఆర్టిస్టులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినప్పుడు సహజంగానే వాళ్ల నుంచి ఆశించిన అవుట్ పుట్ వస్తుంది.

'లేడీస్ టైలర్' .. 'ఏప్రిల్ 1 విడుదల' .. 'ఆ ఒక్కటీ అడక్కు' క్లైమాక్స్ సీన్స్ ఇంటికి వెళ్లిన తరువాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి ఒక సీన్ ను ఈ సినిమాలో నాపై తీయడం జరిగింది. ఆ సీన్ కి ఒక పాటను తోడు చేసి ఎమోషనల్ లెవెల్స్ ను పెంచేశారు. ఆ సాంగ్ వినగానే నేను షాక్ అయ్యాను .. అంతగా గొప్పగా వచ్చింది. మీకు కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.

ఈ నెల 17వ తేదీన మీరంతా థియేటర్లకు వెళ్లి సినిమాను చూడండి. ఎక్కడా కూడా మీకు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించదు .. అలా జరిగితే అందుకు నేను బాధ్యుడిని. ఈ సినిమా చేసిన తరువాత కోన వెంకట్ నాతో ఒక మాట అన్నారు. "ఇంకెప్పుడు మీరు లేకుండా సినిమా తీయనండి" అన్నాడు. ఒక ఆర్టిస్ట్ కి అంతకంటే ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చారు.