వామ్మో.. మళ్లీ ప్రభాస్ తో సినిమానా? : రాజమౌళి

Tue Dec 01 2020 11:45:03 GMT+0530 (IST)

Rajamouli Talking About Movie With Prabhas

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు 'ఛత్రపతి' 'బాహుబలి' 'బాహుబలి 2' చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత వీరి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సినిమాలు మాత్రమే చేసే స్థాయికి ప్రభాస్ స్టార్ డమ్ చేరింది. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా ప్రభాస్ - జక్కన్న కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని అడగగా ఫన్నీగా సమాధానం చెప్పాడు.ప్రభాస్ ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ.. ''వామ్మో.. మళ్లీ ప్రభాస్ తోనా? బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్ లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో'' అని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఈ మాటలు మాటలు అన్న తర్వాత నవ్వుతూ ''సరదాగా అలా అన్నాను. నిజంగా ప్రభాస్ తో సినిమా చేయడం నాకు ఇష్టమే. మంచి కథ కుదిరితే తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం'' అని జక్కన్న చెప్పారు. కాగా రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్.ఆర్.ఆర్' అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.