బాలయ్యబాబు .. ఒక ఆటంబాంబు: రాజమౌళి

Sun Nov 28 2021 10:06:09 GMT+0530 (IST)

Rajamouli In Akhanda Pre Release Event

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'సింహా' .. 'లెజెండ్'  రెండు సినిమాలు కూడా సంచలన విజయాలను సాధించాయి. బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాల జాబితాలో నిలిచాయి. దాంతో సహజంగానే వాళ్ల కాంబినేషన్లో మూడో సినిమాగా వస్తున్న 'అఖండ'పై భారీ అంచనాలు ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి నిర్వహించారు.హైదరాబాద్ .. మాదాపూర్ .. శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు రాజమౌళి స్పెషల్ గెస్టుగా విచ్చేశారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "బోయపాటి శ్రీను గారూ థ్యాంక్యూ .. ఈ ఆడిటోరియానికే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపు తెప్పించినందుకు. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి ఇక కంటిన్యూస్ గా మళ్లీ అన్ని థియేటర్లు ఇంత ఫుల్ గా .. ఇంత అరుపులు కేకలతో నిండిపోవాలి.  

ఇక్కడ కూర్చున్న మాకు ఎంత ఆనందం కలిగిందో రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఎక్కడెక్కడ తెలుగువాళ్లున్నా వాళ్లందరికీ అంత ఆనందం కలుగుతుందని కచ్చితంగా చెబుతున్నాను. బాలయ్య బాబు ఒక ఆటంబాంబు .. ఆ ఆటంబాంబును ఎలా ప్రయోగించాలనేది బోయపాటి శ్రీనుగారికి బాగా తెలుసు. మీరేమో ఆ సీక్రెట్ ఎవరికీ చెప్పరు .. మీ దగ్గర దాచేసుకుంటే కుదరదు. బాలకృష్ణగారు కూడా ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏమిటో చెప్పాలి. ఆ డాన్సులేంటి సార్ .. ఆ ఎనర్జీ ఏంటిసార్.

ఇప్పుడు నేను ఈ స్టేజ్ పై చూసింది మచ్చుతునకే. మొత్తం సినిమా నిండా ఇలాంటివి బోలెడన్ని ఉంటాయి. సినిమా థియేటర్లలో అఖండ కేరక్టర్ ఎంట్రీ కోసం మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఫస్టు డే .. ఫస్టు షోను థియేటర్లో చూస్తాను. అఖండ  చాలా  చాలా పెద్ద హిట్ కావాలి. మళ్లీ మా ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ను అందించాడు. మిర్యాల రవీందర్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ ముగించారు.