పునీత్ చనిపోయే వరకూ ఆ విషయం ఎవరికీ తెలియదు: రాజమౌళి

Sat Nov 27 2021 16:00:45 GMT+0530 (IST)

Rajamouli Comment on  Puneet

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి దాదాపు నెల రోజులు కావస్తోంది. ఆయన ఆకస్మిక మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ గుండెపోటుతో చనిపోవడంతో ఇప్పటికీ చాలా మందికి షాకింగ్ గానే ఉంది. ఆయన మృతికి టాలీవుడ్ కూడా ఘన నివాళి అర్పించించి. సినీ ప్రముఖులు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి బెంగళూరులోని పునీత్ ఇంటికి వెళ్లారు.పునీత్ రాజ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన రాజమౌళి.. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివంగత నటుడితో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పునీత్ మరణం తనని ఎంతగానో కలచివేసిందని.. ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తానొక స్టార్ అనే విధంగా ప్రవర్తించడని.. డౌన్ టు ఎర్త్ పర్సన్ అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదని.. పునీత్ చనిపోయిన తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయని దర్శకుడు అన్నారు.

''నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ ని కలిశాను. నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఎంతో సరదాగా మాట్లాడారు. ఒక స్టార్ తో మాట్లాడుతున్నాననే భావనే నాకు కలగలేదు. అలాంటి పునీత్ మరణ వార్త విని షాక్ కి గురయ్యాను. ఆయన మన మధ్య లేరనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన ఎంతోమందికి సాయం చేశారని మరణం తర్వాతే అందరికీ తెలిసింది. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా అందరికీ తెలియాలనుకుంటాం. కానీ పునీత్ అలా కాదు. తను ఎంత మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పకోలేదు'' అని రాజమౌళి చెప్పారు.