శాలువాలమ్మే రాజ్ కుంద్రా.. బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసే స్థాయికి ఎలా?

Tue Jul 20 2021 10:54:47 GMT+0530 (IST)

Raj Kundra sells shawls in Nepal .. How did he become finance Bollywood?

బాలీవుడ్ ప్రముఖులకు పరిచయస్తుడు.. వ్యాపారవేత్తగా ముంబయిలో గుర్తింపు.. సెలబ్రిటీ స్టేటస్.. ఇలాంటివెన్ని ఉన్నా రాజ్ కుంద్రా పేరు సామాన్యులకు పెద్దగా తెలీదు. ఎప్పుడైతే బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని పెళ్లాడాడో.. ఓవర్ నైట్ లో కోట్లాది మందికి సుపరిచితుడయ్యాడు. లండన్ వ్యాపారవేత్తగా చెప్పుకున్నా.. అతగాడి గతంలోకి వెళితే.. బాలీవుడ్ సినిమాకు సరిపోయే మసాల కనిపిస్తుంది.తాజాగా నీలిచిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణతో పోలీసులు అరెస్టు చేయటంతో అతడి పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో పాటు బెట్టింగ్ - వివాదాల వ్యవహారాల ఎపిసోడ్ లో రాజ్ కుంద్రా పేరు బాగా నలిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనపై మరిన్ని ఆరోపణలు చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడో సెలబ్రిటీగా సుపరిచితుడైన అతడు.. కొన్నేళ్ల క్రితం సాదాసీదాగా తన జీవితాన్ని షురూ చేశాడు. పంజాబ్ లోని లూథియానాకు చెందిన రాజ్ కుంద్రా కుటుంబం అతని చిన్నతనంలోనే లండన్ కు వలస వెళ్లింది.

తండ్రి అక్కడ బస్ కండక్టర్ గా పని చేస్తే..తల్లి చిన్న షాపులో పని చేసేవారు. పద్దెనిమిదేళ్ల వయసులో దుబాయ్ వెళ్లిన రాజ్ కుంద్రా.. అక్కడి నుంచి నేపాల్ వెళ్లాడు. అక్కడ శాలువాల బిజినెస్ చేశాడు. కొన్నేళ్ల  తర్వాత తాను చేస్తున్న వ్యాపారానికి తన తెలివిని పెట్టుబడిగా పెట్టిన అతడు.. బ్రిటన్ కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు శాలువాల్ని అమ్మి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్ ఆసియాలో సంపన్న వ్యక్తిగా 198వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

2007లో దుబాయ్ కు మరోసారి వెళ్లిన అతడు.. నిర్మాణ రంగంలో కాలు మోపాడు.  ఆ సమయంలోనే బాలీవుడ్ కనెక్షన్స్ రావటం.. సినిమాలకు ఫైనాన్స్ పెట్టటం మొదలు పెట్టారు. సంజయ్ దత్.. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లతో పరిచయంతో కొత్త బిజినెస్ లు చేయటం మొదలుపెట్టాడు. లైవ్ బ్రాడ్ కాస్ట్.. గేమింగ్.. స్పోర్ట్స్ సంబంధిత వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు.

ఆ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరున్న శిల్పాశెట్టితో పరిచయం.. ప్రేమగా మారటం.. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి.. శిల్పను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో .. అతడు అందరికి సుపరిచితుడిగా మారాడు. అనంతరం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో పాటు బెట్టింగ్ వివాదాలతో అతని పేరు బాగా నానటంతో పాటు.. అతని ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. కేసులు.. వివాదాలతో కిందామీదా పడిన పరిస్థితి.

ఒకప్పుడు దేన్లో కాలు పెడితే ఆ రంగంలో బాగా సంపాదించిన రాజ్ కుంద్రాకు.. తర్వాతి కాలంలో ఎదురుదెబ్బలు తగలటంతో అతడి ఆలోచనలు మారాయి. సంపాదన కోసం అడ్డదారుల్లోకి వెళ్లేందుకు తెగించాడు. సినిమాలు.. వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వారి చేత అగ్రిమెంట్లు చేయించుకోవటం.. అనంతరం న్యూడ్.. సెమీ న్యూడ్ సినిమాలు తీయటం.. ఆ వీడియోల్ని అప్ లోడ్ చేయటం ద్వారా భారీగా డబ్బులు సంపాదించినట్లు చెబుతారు. దీనికి సంబంధించిన ఫిర్యాదుతో పాటు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ఒక ఘటన తాజా అరెస్టుకు దారి తీసింది.

వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అలా వారు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిలో నటి కం మోడల్ గెహానా వశిష్ఠ్.. రోవా ఖాన్ ఉన్నారు. ఈ ప్రొడక్షన్ యూకే ప్రొడక్షన్ కంపెనీదిగా గుర్తించారు. దానికి హెడ్ గా ఉమేశ్ కామత్ కావటం.. అతడు గతంలో రాజ్ కుంద్రా వద్ద పని చేసినట్లు గుర్తించారు. అలా.. ఈ ఇష్యూ పలు మలుపులు తిరిగి.. ఈ రాకెట్ లో రాజ్ కుంద్రా ప్రమేయం ఉందన్న ఆధారాల్ని సంపాదించిన పోలీసులు.. తాజాగా అతడ్ని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. రానున్నరోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.