Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:21 PM GMT
ఎట్టకేలకు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు
X
అశ్లీల రాకెట్ కేసులో రెండు నెలల క్రితం అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుపై ముంబై కోర్టు కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రాతోపాటు ఆయన కంపెనీల్లో ఒకదానికి ఐటీ హెడ్ గా వ్యవహరిస్తున్న ర్యాన్ థ్రోప్ కు కూడా బెయిల్ మంజూరైంది.

రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ పై సోమవారం ముంబై కోర్టులో విచారణ జరిగింది. ఆయన తరుఫున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపించారు. రాజ్ కుంద్రా చార్జ్ షీట్ లో అశ్లీల కంటెంట్ ను ఆయనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు అని పేర్కొన్నారు. రాజ్ కుంద్రాను తప్పుడు కేసులో ఇరికించి బలిపశువును చేశారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో రాజ్ కుంద్రా పేరు కూడా లేదని.. అయినప్పటికీ అతడిని కేసులోకి లాగారని ఆరోపించారు.

గత గురువారం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో రాజ్ కుంద్రాపై చార్జిషీట్ దాఖలు చేయగా.. శనివారం అతడు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. గతంలో హైకోర్టు రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. తాజాగా ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజ్ కుంద్రాకు భారీ ఊరట లభించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలవుతారు.

అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.