ఫొటోటాక్ : నిజంగా బాలు గారు కళ్ల ముందు ఉన్నట్లుంది

Sat Oct 17 2020 13:20:27 GMT+0530 (IST)

Phototalk: Really looks like the balu is in front of the eyes

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మృతి చెంది వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఎక్కడ ఆయన పాట విన్నా కూడా ఇంకా ఆయన బతికే ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆయన్ను ఊహించుకుంటున్నారు. కరోనా కారణంగా క్షీణించిన ఆరోగ్యం మళ్లీ బాగుపడలేదు. దాంతో ఆయన కరోనాను జయించినా ఆ తర్వాత కొన్ని రోజులకు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉంటే మరెన్ని గానామృతాలను మనకు అందించేవారో. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చలేనిది. ఆయన జ్ఞాపకాలను ప్రజలకు ఇచ్చేందుకు గాను ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ బాలు గారి విగ్రహంను తయారు చేశారు.ఈస్ట్ గోదావరికి చెందిన శిల్పి రాజ్ కుమార్ గారి వద్ద బాలు గారు గతంలో తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించారు. బతికి ఉండగానే తన విగ్రహంను తయారు చేయాల్సిందిగా బాలు గారు రాజ్ కుమార్ కు చెప్పారు. ఆ విగ్రహం తయారు చేస్తున్న సమయంలోనే అలా జరిగి పోయింది. బాలు గారు మృతి చెంది నెల రోజులు కాబోతున్న నేపథ్యంలో ఆయన విగ్రహంను రాజ్ కుమార్ పూర్తి చేశారు.

సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాలను తీర్చి దిద్దడం రాజ్ కుమార్ ప్రత్యేకత. బాలు గారి విగ్రహంలోనూ పూర్తి డీటైల్స్ ను తీసుకు వచ్చి నిజంగా బాలు గారు కళ్ల ముందు ఉన్నారా అన్నట్లుగా విగ్రహాన్ని మల్చారు. బాలు గారి జ్ఞాపకార్థం ఆయన అభిమానులు చాలా చోట్ల విగ్రహాలను ప్రతిష్టించేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగు ప్రభుత్వాలు కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.