Begin typing your search above and press return to search.

ప్రస్తుతం టాలీవుడ్ లో 'అన్నమయ్య' లాంటి పాత్రల్లో నటించే హీరోలు ఉన్నారా...?

By:  Tupaki Desk   |   22 May 2020 10:30 PM GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో అన్నమయ్య లాంటి పాత్రల్లో నటించే హీరోలు ఉన్నారా...?
X
అక్కినేని నాగార్జున - రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన అద్భుత చిత్రం 'అన్నమయ్య'. ఈ సినిమా 1997 మే 22న విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి 23 ఏళ్ళు అయింది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికి టీవీలలో టెలికాస్ట్ చేస్తే జనాలు టీవీలకు అతుక్కొని పోయి చూస్తారు. 'అన్నమయ్య' సినిమా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దర్శకేంద్రుడు అద్భుత ఊహాలోకంలోంచి పుట్టుకొచ్చిన అపురూప చిత్రం 'అన్నమయ్య' అని చెప్పవచ్చు. రొమాంటిక్ సీన్స్.. మాస్ బీట్స్.. యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో ఆధ్యాత్మిక భక్తిరస చిత్రంతో అందర్నీ మెప్పించాడు. తెలుగు సినీ చరిత్రలో అన్నమయ్యది ఓ సువర్ణాధ్యాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టైలిష్ సినిమాలు.. లవ్ స్టోరీస్.. యాక్షన్ మూవీస్ తో యువ సామ్రాట్ గా గ్రీకువీరుడిగా వెలుగొందుతున్న నాగార్జున ఈ సినిమాలో నటించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడని చెప్పవచ్చు. నాగార్జున అసలు ఈ క్యారెక్టర్ కు సరిపోతాడా.. ఇలాంటి పాత్రలో నటించగలడా.. జనం చూస్తారా.. ఈరోజుల్లో ఇలాంటి సినిమా ఆడుతుందా.. అనే ప్రశ్నలకు తిరుగులేని సమాధానం చెప్పింది 'అన్నమయ్య'. ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్ ఓ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయిందట.

నాగార్జునలో ఆస్థాయి నటనను గానీ.. రాఘవేంద్రరావు నుంచి ఇంతటి ఆధ్యాత్మికను కానీ ఊహించలేదు ప్రేక్షకులు. ఈ సినిమా విడుదలై 23 ఏళ్ళయిన సందర్భంగా నాటి జ్ఞాపకాల్లో మునిగిపోయాడు దర్శకేంద్రుడు. 'అన్నమయ్య' సినిమాని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు రాఘవేంద్ర రావు. ఈ మేరకు ఆయన ప్రతీ ఒక్కరినీ పేరు పేరున ప్రస్తావిస్తూ అందరి శ్రమను ప్రశంసించాడు. ''నా పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు.. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాను. ఓ ప్రత్యేకమైన చిత్రం అన్నమయ్య విడుదలైంది. నా జీవితాంతం సంతోష పడే చిత్రం. అలాంటి సినిమాను చేసే అవకాశాన్ని ఇచ్చిన ఆ దైవానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం పాటు పడిన నాగార్జున - మోహన్ బాబు - సుమన్ - రమ్యకృష్ణ - కస్తూరి, - కీరవాణి - భారవి - దొరసామి రాజు వారి శ్రమను నేనెప్పటికి మరిచిపోలేను. వారే కాకుండా మరపురాని ఈ చిత్ర ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు'' అని ట్వీట్ చేసారు.

ఈ సందర్భంగా 'అన్నమయ్య' లాంటి సినిమాలు ఇప్పట్లో ఎందుకు రావడం లేదనే ప్రశ్న అందరిలో మొదలవుతోంది. సృష్టి ఉన్నన్ని రోజులు ఆద్యాత్మికత అనేది ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో సినిమాలు మాత్రం రావడం లేదనేది వాస్తవం. అలాంటి సినిమాలు తీసే హీరోలు దర్శకులు ఇప్పుడు ఎవరున్నారు అనే ప్రశ్న తలెత్తక మానదు. యువసామ్రాట్ అనే ఇమేజ్ ఉన్నప్పుడే నాగార్జున డేర్ చేసి 'అన్నమయ్య' 'శ్రీరామదాసు' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మరి ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఎంతమంది అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ముందుకొస్తారు. ఇమేజ్ ఫ్యాన్స్ ఒపీనియన్ అంటూ మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోయే హీరోలు ఆధ్యాత్మిక సినిమాలు చేయడానికి ముందుకొస్తారా...? అలాంటి ఆధ్యాత్మిక సినిమాలు తీయడానికి రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారా..? అనే అనుమానం రాకమానదు. రాబోయే రోజుల్లో అయినా 'అన్నమయ్య' లాంటి చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక చిత్రాలు రావాలని కోరుకుందాం.