'రాధే శ్యామ్' టీజర్: విక్రమాదిత్య దేవుడు కాదు.. మనలో ఒకడు కాదు..!

Sat Oct 23 2021 11:39:55 GMT+0530 (IST)

'Radhe Shyam' teaser as a visual wonder ..!

నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అంటే అభిమానులందరికీ పండుగ రోజు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వింటేజ్ రొమాంటిక్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్'' టీజర్ కూడా వచ్చేసింది.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు. ఇప్పటి వరకు ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ ‘గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్’ తో పాటుగా కొన్ని ప్రచార చిత్రాలు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ‘రాధేశ్యామ్’ టీజర్ విక్రమాదిత్య ఎవరనే విషయాన్ని తెలియజేస్తోంది. పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఒకే భాషలో ఈ టీజర్ ని వదిలారు.

''నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు.. కానీ నీకు ఏది చెప్పను.. ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు.. నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు'' అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా అలరిస్తోంది.

'రాధే శ్యామ్' టీజర్ చూస్తుంటే ఇందులో వింటేజ్ లవ్ స్టోరీయే కాకుండా అంతకు మించి ఏదో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడు గా కనిపించనున్నారు. సైన్స్ కి జ్యోతిష్యానికి లింక్ చేస్తే ఓ ప్రేమ కథను చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. 70ల కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

ప్రభాస్ ఇందులో బాడీ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మొత్తం మీద ఇన్నాళ్లుగా ఆకలి మీదున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు 'రాధే శ్యామ్' టీజర్ ఆకలి తీర్చిందనే చెప్పాలి.

'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్దికుమార్ - సత్యన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా చైనీస్ జపనీస్ బాషల్లో కూడా 'రాధే శ్యామ్' రిలీజ్ కానుంది.