Begin typing your search above and press return to search.

సల్మాన్‌ సినిమా పేరుకే అలా..

By:  Tupaki Desk   |   22 April 2021 9:30 AM GMT
సల్మాన్‌ సినిమా పేరుకే అలా..
X
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇంకో వుడ్ అని తేడా లేకుండా ప్రతి ఫిలిం ఇండస్ట్రీలోనూ మళ్లీ తిరోగమన పరిస్థితులు మొదలయ్యాయి. కొత్త సినిమాల వాయిదా అనివార్యం అవుతోంది. మళ్లీ ఎప్పుడు మామూలు పరిస్థితులు నెలకొంటాయో స్పష్టత లేదు. గత ఏడాది లాక్ డౌన్ విరామం తర్వాత మిగతా పరిశ్రమలతో పోలిస్తే త్వరగా పుంజుకుని నార్మల్సీ దిశగా అడుగులు వేసిన టాలీవుడ్లోనూ ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడిచే పరిస్థితులు కనిపించక సినిమాన్నీ వాయిదా పడిపోయాయి. షూటింగ్‌లన్నీ ఆగిపోతున్నాయి. అలాంటిది బాలీవుడ్‌కు కేంద్ర స్థానం అయిన ముంబయిలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలిసిందే. మహారాష్ట్రలో ఎవ్వరూ కూడా థియేటరుకు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అక్కడ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లాంటివి అమలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్త హిందీ సినిమా సమీప భవిష్యత్తులో రిలీజయ్యే అవకాశాలే కనిపించడం లేదు. పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉన్న సమయంలోనే హిందీ సినిమాలకు వసూళ్లు లేవు. అలాంటిది కోవిడ్ సెకండ్ వేవ్ పీక్స్‌కు వెళ్తున్న సమయంలో రంజాన్ కానుకగా మే 13న సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం ‘రాధె’ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాకపోతే ఈ సినిమా థియేటర్లలోనే కాక ‘జీ’ వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో, డీటీహెచ్‌ల ద్వారా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

థియేటర్లలో నార్మల్సీ వచ్చే వరకు ఆగాలి లేదంటే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలి కానీ.. ఇలా రెండు రకాల రిలీజ్ ఏంటి అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ పేరుకు థియేటర్లలోనూ రిలీజ్ చేస్తున్నారు కానీ.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లే భావించాలి. సల్మాన్ స్థాయి హీరో థియేటర్లను విడిచిపెట్టి నేరుగా ఓటీటీలో సినిమా రిలీజ్ చేశాడంటే కొన్ని విమర్శలు తప్పకపోవచ్చు. అందుకే థియేటర్లలో రిలీజ్ చేయలేదనే మాట రాకుండా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుంది. ఇప్పుడు జనాలు ఎలాగూ థియేటర్లకు రారు, ఎక్కువగా డబ్బులు కట్టి ఇంట్లో టీవీల్లోనే సినిమా చూస్తారు. అప్పుడు నింద సల్మాన్ మీద ఉండదు. ఎగ్జిబిటర్లు ప్రశ్నించడానికి వీలుండదు. థియేటర్లలోనూ రిలీజ్ చేశాం, కానీ జనాలు వచ్చి చూడలేదని అనొచ్చు. అందుకే తెలివిగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.