పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ సమయం దగ్గరపడటంతో వీలైనంత ప్రచారం కల్పించాలని యూనిట్ పక్కా ప్లానింగ్ తో ముందుకు కదులుతోంది. దీనిలో భాగంగా డిసెంబర్ 9న ట్రైలర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు నేరుగా థియేటర్లలోనే ట్రైలర్ లాంచ్ జరుగుతుందని సమాచారం. అయితే ఇప్పుడీ ట్రైలర్ వివిధ భాషల్లో వేర్వేరు మెట్రో పాలిటన్ సిటీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు అని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది.
ముంబై..హైదరాబాద్..బెంగుళూరు..చెన్నై సిటీల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా యూనిట్ డివైడ్ అయి ట్రైలర్ లాంచ్ చేస్తారా? లేక అంతా కలిసి ఒకే రోజు లాంచ్ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారా? అన్నది తెలియాలి. ఒకే రోజు నాలుగు సిటీల్లో తిరగడం అంటే కష్టం. సమయం దొరకదు. మరి జక్కన్న మైండ్ లో ఏముందో. హైదరాబాద్..ముంబై సిటీల్లో మాత్రం కచ్చితంగా రామ్ చరణ్..ఎన్టీఆర్..రాజమౌళి తప్పక హాజరవ్వాలి. బాలీవుడ్ నుంచి అయితే ఓ పెద్ద హీరోని ఆహ్వానించి లాంచ్ చేయించే అవకాశం ఉంది. కోలీవుడ్ లో ఆ ఛాన్సెస్ తక్కువ. మరి బెంగుళూరులో కన్నడ స్టార్ ని రంగంలోకి దించుతారేమో చూడాలి.
`బాహుబలి` వసూళ్లు టార్గెట్ గా `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. సినిమా హిట్ అయితే తారక్..చరణ్ పాన్ ఇండియా హీరోలగా గుర్తింపు దక్కించుకుంటారు. ఈ చిత్రం జనవరి 7న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చారు.