డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే ‘RRR’ ట్రైలర్.. కంఫర్మ్ చేసిన రాజమౌళి..!

Thu Nov 25 2021 14:32:24 GMT+0530 (IST)

RRR trailer in the first week of December

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన కల్పిత కథతో ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది.2022 జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘జనని’ అనే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

'RRR సోల్ ఆంథమ్' గా చెబుతున్న 'జనని' పాట రేపు శుక్రవారం (నవంబర్ 26) విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే ముందుగానే ఈరోజు గురువారం మీడియా వారి కోసం చిత్ర యూనిట్.. ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి - నిర్మాత దానయ్య విలేకర్లతో మాట్లాడారు. ''సినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేశాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ‘RRR’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఉంది.

తర్వాత వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏర్పాట్లు చేస్తున్నాం. అలానే నటీనటులు టెక్నిషియన్స్ మీడియాతో స్పెషల్ గా ఇంటరాక్ట్ అవుతారు. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాం. ఎందుకంటే ఇప్పుడు కేవలం 'జనని' గురించే మీకు చెప్పాలని అనుకుంటున్నాను'' అని రాజమౌళి తెలిపారు.

''RRR లో బోలెడన్ని యాక్షన్ సీన్స్ - హీరో ఇంట్రడక్షన్స్ - ఇంట్రెవెల్ - క్లైమాక్స్ సీక్వెన్స్ - ఎమోషనల్ సీక్వెన్స్.. ఇలా చాలా ఉంటాయి. అయితే ప్రతీ మూమెంట్ కు కూడా హార్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. 'నాటు నాటు' లాంటి మాస్ నంబర్ లో కూడా ఒక ఎమోషన్ డ్రైవ్ అవుతూ ఉంటుంది.

ఈ ఎమోషన్స్ అన్నిటికి ఇంకా లోపలికి వెళ్ళి తెరిచి తెరిచి చూస్తే ఒక సాఫ్ట్ కోర్ ఎమోషన్ ఉంటుంది. మణిహారంలోని దారంలా అది కంటికి కనిపించదు. కానీ సినిమాలోని సీన్స్ అన్నింటిలో ఉంటుంది. దానికి సంగీత రూపం ఇస్తే అదే ఈ 'జనని'. RRR సినిమా మొత్తానికి ఈ పాట సోల్ లాంటిది''

''సినిమా పూర్తయ్యే క్రమంలో రీ రికార్డింగ్ ను నేను చాలా ఎంజాయ్ చేస్తాను. పెద్దన్న కీరవాణి రెండు నెలలు రీరికార్డింగ్ చేసిన తర్వాత ఒకరోజు ఈ కోర్ మెలోడీని పట్టుకొచ్చారు. తెలుగు వెర్సన్ కు లిరిక్స్ కూడా తనే రాశారు. అందరూ 'జనని' పాట చూసి మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోండి. ఇది ప్రమోషన్ కాదు.

ప్రమోషన్ అంటే ఆ హడావిడి గోల అంతా వేరే రకంగా ఉంటుంది. ఇది కేవలం మా సోల్ ని షేర్ చేసుకోడానికే ఏర్పాటు చేశాం'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి విలేఖరులకు మాత్రమే వినిపించిన ఈ పాటను రేపు ప్రేక్షకుల కోసం విడుదల చేయనున్నారు. అయితే అప్పుడే ఈ పాటలోని కొన్ని షాట్స్ లీక్ కాబడి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు.

అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రకు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'దోస్తీ' 'నాటు నాటు' పాటలు అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రాబోతున్న ‘జనని’ పాట ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.