టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'ఆర్.ఆర్ ఆర్' కొమురం భీమ్..!

Thu Apr 22 2021 21:32:10 GMT+0530 (IST)

'RRR' Komuram Bheem has created a new record in Tollywood

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో 'కొమురం భీమ్' గా తారక్ నటిస్తుండగా.. 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ నటిస్తున్నాడు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'భీమ్ ఫర్ రామరాజు' 'రామరాజు ఫర్ భీమ్' పేర్లతో విడుదలైన హీరోల ఇంట్రో వీడియోలు మిలియన్ల వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది.'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి 2020 అక్టోబర్ 22న విడుదల చేయబడిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50M+ వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్ గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ వీడియోకి 1.3M పైగా లైక్స్ మరియు 1.4M కామెంట్స్ వచ్చాయి. యూట్యూబ్ లో కొమురం భీమ్ హవా చూస్తుంటే టాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోలకు భారీ టార్గెట్ ను నిర్దేశించడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. '#GonduBebbuliNTRHits50M' హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

కాగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్ - ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.