Begin typing your search above and press return to search.

చాలా క‌బుర్లు చెప్పాడు కానీ RRR ముందు తేలిపోయాడు!

By:  Tupaki Desk   |   3 April 2022 12:30 AM GMT
చాలా క‌బుర్లు చెప్పాడు కానీ RRR ముందు తేలిపోయాడు!
X
బాలీవుడ్ తోపు అనేది ఒక‌ప్పుడు.. ఇప్పుడు కాదు! ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా ప్ర‌భంజ‌నం ముందు అన్నీ కొట్టుకుపోతున్నాయి. క‌రోనా క్రైసిస్ క‌ష్టంలోనూ ఓ వైపు హిందీ సినిమా ఐపు లేకుండా పోతుంటే తెలుగు సినిమా మునుప‌టి కంటే షైన్ అయ్యిందే కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

అయితే ఇంత జ‌రుగుతున్నా.. ఇంకా బింకానికి పోతున్నారు బాలీవుడ్ స్టార్లు. తెలుగు సినిమా గొప్ప‌త‌నాన్ని అంగీక‌రించేందుకు ఈగో అడ్డొస్తోంది. ఓవైపు వ‌రుస‌గా విడుద‌ల‌వుతున్న హిందీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలుస్తుంటే తెలుగు నుంచి హిందీ బెల్ట్ కి వెళ్లిన ఆర్.ఆర్.ఆర్ సంచ‌లన విజ‌యం సాధించింది.

కానీ దీనిని అంగీక‌రించేందుకు అక్క‌డ స్టార్లు సిద్ధంగా లేరు. ఇక బాలీవుడ్ కండ‌ల హీరో జాన్ అబ్రహం తెలుగు సినిమాని కించ‌ప‌రుస్తూ మాట్లాడిన తీరు మంట పుట్టించింది. నిజానికి జాన్ బాయ్ చాలా క‌బుర్లు చెప్పాడు. తెలుగులో న‌టించ‌న‌న్నాడు.. నేను హిందీ న‌టుడిని హిందీలో మాత్ర‌మే చేస్తాను అంటూ బింకానికి పోయాడు. అయితే తాను బీరాలు పోయినందుకైనా అత‌డు న‌టించిన ఎటాక్ రిలీజై బంప‌ర్ హిట్ కొట్టాలి. కానీ అంతా తారుమారైంది. శుక్రవారం విడుదలైన జాన్ అబ్రహాం `ఎటాక్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. ఇది మిశ్రమ సమీక్షలతో డీలా ప‌డింది. టికెట్ కౌంటర్లో మొదటి రోజు కేవలం రూ. 3.51 కోట్లు మాత్ర‌మే వసూలు చేసింది. అంత పెద్ద స్టార్ కి ఈ కలెక్షన్లు చాలా అన్యాయం. నిజానికి అంత‌కుముందే జాన్ అబ్రహం ప్రాంతీయ సినిమా పై దురహంకారంతో కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఎటాక్ విడుదల ప్ర‌చార‌ కార్యక్రమంలో జాన్ మాట్లాడుతూ.. దేశంలో బాలీవుడ్ నంబర్ టూ ఇండస్ట్రీ కాదని.. తాను బాలీవుడ్ లో మాత్ర‌మే న‌టిస్తానని అన్నారు. సమీప భవిష్యత్తులో ప్రాంతీయ సినిమా చేయను అని కూడా తెగేసి చెప్పాడు.

ఈ వ్యాఖ్యలు నెటిజనుల్లో మంట‌లు పుట్టించాయి. ముఖ్యంగా దక్షిణ భారత సినీ ప్రేమికులకు మింగుడు పడలేదు. అందుకే ఇప్పుడు `ఎటాక్ కలెక్షన్లను ఎత్తిచూపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. విల్ స్మిత్ క్రిస్ రాక్ ని చెంపదెబ్బ కొట్టినట్లుగా కొన్ని మీమ్స్ వైర‌ల్ గా మారాయి. ఇక్కడ విల్ స్మిత్ తెలుగు సినిమా అయితే క్రిస్ రాక్ జాన్ అబ్ర‌హాం అన్న‌మాట‌. హిందీ బెల్ట్‌లోని చాలా థియేటర్లలో `ఎటాక్` చిత్రాన్ని RRR తో భర్తీ చేస్తున్నార‌ని జాన్ అబ్రహం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా తేలిపోయిందో దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్రముఖ సినీ విమర్శకుడు ట్వీట్ చేశారు.

మరోవైపు హిందీ లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ హవా కొనసాగుతోంది. 8వ రోజు ఈ సినిమా రూ.12.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కానీ జాన్ భాయ్ ఎటాక్ రిలీజ్ డే రోజునే కేవ‌లం 3.5 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేయ‌గ‌లిగింది. ఆర్.ఆర్.ఆర్ మొద‌టి రోజు హిందీలో ఏకంగా 19 కోట్ల నెట్ వ‌సూలు చేసింది. మొద‌టి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం 200 కోట్లు పైగా వ‌సూలు చేసింది. జాన్ భాయ్ ఇప్పుడు చెప్పండి. త‌మ‌రి ఎటాక్ డే వ‌న్ లో ఎంత వ‌సూలు చేసిందో? అంటూ కౌంట‌ర్లు ఒక రేంజులో ప‌డిపోతున్నాయి. హిందీ హీరోల్లో చింత చచ్చినా పులుపు ఇంకా చావ‌లేదు! అంటూ పంచ్ లు ప‌డిపోతున్నాయి.