వివాదాల వర్మను సొంత ఓటీటీనే ఆదుకోవాలేమో!

Mon Jul 13 2020 11:15:00 GMT+0530 (IST)

RGV World Theatre Launched with Mia Malkova CLIMAX

వివాదాలతో సావాసం చేయడం అంటే అది ఎంతో రిస్కుతో కూడుకున్నది. పెట్టుబడుల(మనీ)తో ప్రయోగం కిందే లెక్క. ఇటీవల వెబ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు వివాదాస్పద కంటెంట్ తో తెరకెక్కి నానా రచ్చకు కారణమవుతున్నాయి. ఒకవేళ వీటిపై కోర్టుల్లో పోరాడాల్సి వస్తే.. మధ్యలోనే ప్రసారం నిలిచిపోతే ఆ మేరకు నిర్మాతలు నష్టపోక తప్పదు. ఇన్నాళ్లు వెబ్-యూట్యూబ్- ఓటీటీ కంటెంట్ పై సెన్సార్ షిప్ లేకపోవడం వల్ల కూడా ఎవరికి వారు ఎడా పెడా ఇక్కడ పెట్రేగుతున్నారు. కానీ భవిష్యత్ లో ఇలానే ఉంటుందా? అంటే చెప్పలేం.ఇక ఆర్జీవీ లాంటి కాంట్రవర్శీ కింగ్ వెబ్ కంటెంట్- ఓటీటీపై పడితే ఎలా ఉంటుందో ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తోంది. జీఎస్టీ- క్లైమాక్స్ అంటూ శృంగారతార మియా మల్కోవాని బరిలో దించి ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాడో జనం చూస్తూనే ఉన్నారు. అలాగే తెలుగమ్మాయి శ్రీ రాపాకతో నగ్నం పేరుతో వల్గారిటీని క్యాష్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. మునుముందు ఓటీటీ కంటెంట్ అంటేనే అసభ్యత అశ్లీలత అన్నంతగా దిగజారిపోవడం చూస్తున్నదే. ఇక సంఘంలోని ప్రముఖుల జీవితకథల్ని ఓటీటీ కంటెంట్ లో దించేసేందుకు ఆర్జీవీ ఏమాత్రం వెనకాడడం లేదు. పవన్ కల్యాణ్ .. మారుతీరావు వంటి వారి కథల్ని వండి వార్చి సినిమాలు తీస్తున్నారాయన.

అందుకే ఆర్జీవీ క్రియేట్ చేసే కంటెంట్ ఓటీటీలో సజావుగా రిలీజ్ కావడం సాధ్యమేనా? అంటే సందేహం వ్యక్తమవుతోంది. మునుముందు ఆర్జీవీ తెరకెక్కించే ఓటీటీ కంటెంట్ ని కొనుక్కునేవాళ్లే ఉండరా? అంటే అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే `పవర్ స్టార్` సినిమాని రిలీజ్ చేస్తామని ముందుకొచ్చిన శ్రేయాస్ వాళ్లు వెనకడుగు వేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై సెటైరికల్ మూవీని తీస్తున్న వర్మకు ఊహించని ఝలక్ ఇది. ఇప్పుడు పవర్ స్టార్ ని ఎంఎక్స్ ప్లేయర్ లో రిలీజ్ చేయాలని వర్మ భావిస్తున్నారట. ఆ మేరకు సదరు ఓటీటీతో చర్చ సాగిస్తున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఆర్జీవీ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఓటీటీ వాళ్లు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆర్జీవీ ఇంతకుముందు ప్రకటించినట్టు తన సొంత ఓటీటీనే ప్రారంభించి అందులోనే అతడు తెరకెక్కించే వాటిని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందేమో!! `RGV వరల్డ్ థియేటర్` ఇంతకీ ఎప్పటికి రెడీ అవుతుంది? ఓటీటీని స్టార్ట్ చేస్తున్నాడా లేదా? పవర్ స్టార్ ఏ ఓటీటీలో రిలీజవుతుంది?   వీటన్నిటికీ ఆయనే సమాధానమివ్వాల్సి ఉంది.