Begin typing your search above and press return to search.

వివాహ వ్యవస్థ - స్టార్ల విడాకులపై ఆర్జీవీ ట్వీట్స్ వైరల్..!

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:31 PM GMT
వివాహ వ్యవస్థ - స్టార్ల విడాకులపై ఆర్జీవీ ట్వీట్స్ వైరల్..!
X
భారతదేశంలో వివాహ వ్యవస్థ గురించి దేశవిదేశాల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావమో లేదా ఆధునిక భావాలు కలిగిన ఈతరం యువతీ యువకుల ఆలోచనలు మరియు మరేవైనా ఇతర కారణాలో తెలియదు కానీ.. ఇప్పుడు మనదేశంలో వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు భార్యాభర్తలు ఎన్ని గొడవలు వచ్చినా సమాజం కోసం పిల్లల కోసం వైవాహిక బంధాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే ఒకటి భావాలను మరొకరు గౌరవించుకుంటూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా విడాకుల దాకా వెళ్తుండటం గమనార్హం.

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరొందిన అక్కినేని నాగ చైతన్య - సమంత.. నాలుగేళ్ళ తమ వైవాహిక జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇప్పుడు లేటెస్టుగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్య జంట తమ 18 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీల విడాకులపై తనదైన శైలిలో స్పందించారు. వివాహ బంధం గురించి వరుస ట్వీట్లు చేస్తూ.. తెలివైన వ్యక్తులే ప్రేమిస్తారని.. అమాయకులు పెళ్లి చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ''స్టార్ల విడాకులు అనేవి పెళ్లి ఎంత ప్రమాదకరమో యూత్ కు తెలిపే హెచ్చరికలుగా మంచి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాయి. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా అది ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యం'' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

''పెళ్లి వేడుకలు ఘనంగా జరిగినన్ని రోజులు కూడా ఈ మధ్య వివాహ బంధాలు నిలవడం లేదు. మూడు నుంచి ఐదు రోజుల్లో తెగిపోతున్నాయి. విడాకులతో పెళ్లి బంధం నుంచి విముక్తి పొందిన వారే సంగీత్ వేడుకలు నిర్వహించుకోవాలి. తెలివైన వ్యక్తులు ఇష్టపడతారు.. డంబోలు వివాహం చేసుకుంటారు. వివాహం అనేది మన దుష్ట పూర్వీకులు ప్రచారం చేసిన సమాజంలోని అత్యంత దుర్మార్గపు ఆచారం'' అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రేమ - పెళ్లి - ఫ్యామిలీ అంటే అస్సలు గిట్టని రామ్ గోపాల్ వర్మ.. కొన్నేళ్ల క్రితమే తన భార్యతో విడిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో అనేకసార్లు వివాహ బంధం మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ''ప్రేమ అంటే ఆనందం.. వివాహం అనేది తలనొప్పి.. విడాకులు అంటే స్వర్గం.. అన్ని వివాహాలు నరకంలో జరుగుతాయని.. విడాకులు స్వర్గంలో జరుగుతాయని నేను నిజాయితీగా నమ్ముతున్నాను. వివాహితులందరూ ఇది నిజమని ఒప్పుకుంటారని నేను ఛాలెంజ్ చేసి చెబుతాను'' అని వర్మ అంటుంటారు.

లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా దానంత బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉండదని ఆర్జీవీ చెప్పారు. పెళ్లి ఎందుకు వద్దంటున్నానో పెళ్లైన వాడిని అడిగితే తెలుస్తుందని.. చిన్నప్పుడు నిప్పు పట్టుకుంటే కాలుతుందని పట్టుకుంటే కానీ తెలియదు. నిప్పు చాలా అందంగా ఉందని పట్టుకుంటే కాలిపోద్ది. పెళ్లి కూడా అలాంటిదే అని వర్మ అప్పట్లో ఓ సందర్భంలో పేర్కొన్నారు.